
- నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ !' అన్న గురజాడ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి.. అంతేకాదు.. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్ .. గట్టిమేల్ తలపెట్టవోయ్ ' అనీ ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రపంచ, దేశ పరిస్థితుల్లో ఇది అత్యవసరమైన అంశం. జనాభా పెరుగుదలలో భారత్ ఇప్పుడు చైనాని దాటి ముందంజలో ఉంది. జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివల్ల లాభ నష్టాలేమిటి? ప్రత్యేకంగా మనదేశంలో జనాభా పెరుగుదల వరమా ? శాపమా ? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కనీసవసరాలు తీరనున్నాయా ? ప్రధానంగా ఈ ఏడాది వివిధ జనాభా సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం థీమ్.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన 'ప్రపంచ జనాభా దినోత్సవం' సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

పెరుగుతున్న ప్రపంచ జనాభా, సహజవనరులు, వాతావరణం, మొత్తం భూమిమీద చూపుతున్న ప్రభావంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం 2023ని జరుపుకుంటున్నాం. ప్రస్తుత ప్రపంచ జనాభా 7,900 కోట్లు దగ్గర ఉంది. ఇది మీరు చదువుతున్నప్పుడే ప్రతి సెకనుకు జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ఒక మార్గాన్ని అన్వేషించడం అత్యవసరం. లేకపోతే మానవ మనుగడ కోసం మరొక భూమి, దాని వనరులు అవసరమవుతాయి.
ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరుకున్నప్పుడు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క పాలక మండలి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్ల మార్కును చేరుకున్నప్పుడు అదే రోజున ఐదు వందల కోట్ల దినోత్సవాన్ని పాటించాలనే ప్రజల ఆసక్తి కారణంగా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
పెరుగుదలే ప్రధాన సమస్య..
మానవ వనరుల్లో జనాభా ముఖ్యమైంది. ఒక దేశాభివద్ధిని నిర్ణయించడంలో జనాభా కీలకపాత్ర వహిస్తుంది. సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించి అధిక ఉత్పత్తిని, ప్రగతిని పెంపొందించడం మానవవనరుల సామర్థ్యంపైనే ఆధారపడుతుంది. అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు, అభివద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికాభివద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైంది జనాభా పెరుగుదల.
దేశాభివద్ధికి సూచిక..
ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ఎడ్విన్ కానన్ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివద్ధికి కారకమవుతుందని అన్నారు. ఇక మన మనుగడకు ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఏడు వందల కోట్ల క్యాంపెయిన్ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1.దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపుచేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి, ఆరోగ్యకరమైన కుటుంబాలకు దారి సుగమం చేయడం. 3. తక్కువ సంతానం, దీర్ఘాయుష్షు వల్ల వద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం.
తగ్గిపోతున్న దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన ఒకవైపు వ్యక్తం అవుతుంటే.. మరికొన్ని దేశాలు తమ జనాభా తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదవుతోంది. ఇటలీలో ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని ఒక అంచనా.

మనదేశమే టాప్..
జనాభా విషయంలో కొన్ని దశాబ్దాలుగా రెండో స్థానంలో ఉన్న భారతదేశం ఈ ఏడాది మొదటి స్థానంలో ఉన్న చైనాను దాటేసింది. అయితే ఈ సందర్భంగా మన దేశం ఐదు ప్రధానాంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.
1. వంద కోట్లు దాటి..
మనదేశంలో చివరి జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగింది. కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన జన గణన వాయిదా పడింది. కాబట్టి, 2023లో వాస్తవంగా ఎంత జనాభా ఉందన్నది కచ్చితంగా తెలీదు. మునుపటి జనాభా లెక్కల ప్రకారం, 1950-80 మధ్య భారత జనాభా వేగంగా పెరిగిపోయింది. 1951లో 36.1 కోట్ల నుంచి 1981కి 68.3 కోట్లకు చేరుకుంది. కేవలం మూడు దశాబ్దాలలో రెండు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 70 ఏళ్ల కాలంలో 100 కోట్లు దాటిపోయింది. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా వద్ధి రేటు తగ్గుముఖం పట్టడంతో పెరుగుదల నెమ్మదించింది. భారత్‌లో జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నుంచి ప్రొఫెసర్ ఉదరు శంకర్ మిశ్రా అన్నారు. 'భారత జనాభా గ్రాఫ్ చూస్తే, మరో నాలుగు దశాబ్దాల పాటు సంఖ్య పెరుగుతూనే ఉంటుందని అంచనా వేయొచ్చు. ఆ తరువాత వద్ధిలో స్థిరత్వం రావచ్చు' అని డాక్టర్ మిశ్రా అన్నారు. మరోవైపు, చైనా జనాభా కొన్నేళ్లుగా 140 కోట్లు పైనే ఉంది. కానీ, ఇటీవల క్షీణించడం ప్రారంభించింది.
2. వద్ధి రేటు
భారత జనాభా వద్ధి రేటు 1950-90 మధ్య రెండు శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఒక దేశంలో జననాల రేటు, మరణాల రేటు మధ్య ఉన్న వ్యత్యాసం బట్టి జనాభా పెరుగుదలను నిర్ధారిస్తారు. ఈ సంఖ్యను గణించేటప్పుడు నికర వలస రేటును పరిగణిస్తారు. 'భారత్‌లో మరణాల రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. కానీ, సంతానోత్పత్తి రేటులో తగ్గుదల జనాభా వద్ధి రేటు క్షీణించడానికి ప్రధానకారణం' అని డాక్టర్ మిశ్రా తెలిపారు. 2021లో దేశ జనాభా వద్ధి రేటు 0.68 శాతానికి పడిపోయింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లో జనాభా వద్ధి రేటు 2017లో రెండు శాతం పైనే ఉంది. దీన్నిబట్టి, భారత్‌లో ప్రజల ఆయుర్దాయం పెరిగింది. తక్కువమంది పిల్లల్ని కంటున్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే వద్ధి రేటు తగ్గుతోంది. ఇప్పటి నుంచి 2050 మధ్య సంతానోత్పత్తి రేటు అధికంగా ఉన్న దేశాలలో జనాభా పెరుగుతుందని, సబ్ సహారన్ ఆఫ్రికాలో, ఆసియాలోని కొన్ని దేశాల్లో అధిక జనాభా ఉండవచ్చని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి. అయితే, గత రెండు దశాబ్దాలుగా మనదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది.
3. సంతానోత్పత్తిలో..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 గణాంకాల ప్రకారం, మనదేశంలో అన్ని మతాల్లోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టింది. జనాభాలో 80 శాతం ఉన్న హిందువుల్లో సంతానోత్పత్తి రేటు 1.9 ఉంది. 1992లో ఈ రేటు 3.3 ఉంది. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలలో 1.4 తగ్గింది. ముస్లింలలో కూడా సంతానోత్పత్తి రేటు బాగా తగ్గింది. 1992లో 4.4 నుంచి 2019లో 2.4 కి తగ్గింది. క్రైస్తవులు, బౌద్ధులు, జైనుల్లో కూడా ఈ రేటు క్షీణిస్తోంది. అయితే, దీనివల్ల రానున్న సంవత్సరాలలో మనదేశంలో జనాభా తగ్గిపోతుందని కాదు. 'చిన్న వయసు ఉన్న మహిళలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ, పెద్ద వయసు వారిలో ఈ రేటు ఎక్కువగానే ఉంది. కాబట్టి మరో 40 ఏళ్లు జనాభా పెరుగుతూనే ఉంటుంది' అని డాక్టర్ మిశ్రా అంటున్నారు. ఐరాస అంచనాల ప్రకారం, ఇలాగే సంతానోత్పత్తి రేట్లు క్రమంగా క్షీణిస్తూ ఉంటే 2100 నాటికి భారత జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఇటీవల పెరుగుదలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో పెరుగుదల రేటు బాగా తగ్గినట్టు లెక్క. సంతానోత్పత్తి రేటులో తగ్గడానికి పలు సామాజిక, ఆర్థిక అంశాలు కారణమని డాక్టర్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం, అమెరికా-1.6, చైనా - 1.2ల కంటే సంతానోత్పత్తి రేటు భారత్‌లో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు బాగా తగ్గింది. 1959లో 5.9, 1992లో 3.4, ఇప్పుడు 2.00కి కాస్త పైన ఉంది.
4. యువతరమే ఎక్కువ..
మనదేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరో 50 ఏళ్ల వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం జనాభాలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు 40 శాతానికి పైనే ఉన్నారు. సగం జనాభా 25-64 వయసుల మధ్యలో ఉన్నప్పటికీ మధ్యస్థ వయసు 28 సంవత్సరాలు. అమెరికాలో మధ్యస్థ వయసు 38, చైనాలో 39. మనదేశంలో వద్ధుల 65 ఏళ్లకు పైబడినవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో కేవలం ఏడు శాతం మాత్రమే వద్ధులు ఉన్నారు. అయితే, వద్ధి రేటులో తరుగుదల కొనసాగితే, వద్ధుల శాతం పెరుగుతుంది.
5. యువత - వద్ధులు
అమెరికా, చైనా, జపాన్‌లో వద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కానీ, మనదేశానికి ఆ సమస్య లేదు. చైనాలో, ప్రతి 10 మందిలో 1.4 మంది 65 ఏళ్లు పైబడినవారు. అమెరికాలో ప్రతి 10 మందిలో 1.8 మంది 65 ఏళ్లు పైబడినవారు. మనదేశంలో కేవలం ఏడు శాతం మాత్రమే 65 ఏళ్లు దాటినవారు. 2010 నాటికి వద్ధులు 23 శాతం పెరుగుతారని ఒక అంచనా. ప్రస్తుతం మనదేశంలో 40 శాతం కంటే ఎక్కువగా 25 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 2078 నాటికి ఇది 23.9 శాతానికి పడిపోతుందని ఐరాస అంచనా. కానీ, 2063 వరకు మనదేశంలో వద్ధులు 20 శాతం లోబడే ఉంటారని అంచనా. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం మరికొన్నేళ్లు యువ దేశంగానే కొనసాగుతుంది.

మాతాశిశు సంరక్షణ..
ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల మరణాలకు, అనారోగ్యానికి ప్రధానకారణం పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు. ఇది సమాజం, ప్రజలపై ప్రభావం చూపించే అంశం. లింగ సమానత్వంపైనా శ్రద్ధ చూపాలని చెబుతోంది. అందుకే దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపడం ఈ రోజు ముఖ్యలక్ష్యంగా ఉండాలనేది ఐరాస నొక్కి చెప్తోంది. ప్రతి ఏడాదీ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పట్ల వారికి అవగాహన కలిగించడం. అందుకు సంబంధించిన నైపుణ్యాలను పెంచాలని చెప్తోంది. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభా పట్ల కుటుంబ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, లింగ సమానత్వం, మాత, శిశువుల ఆరోగ్యం గురించిన అవగాహన అవసరం. పేదరికం, మానవ హక్కులు, ఆరోగ్య హక్కు, లైంగిక విద్య, వంటి సమస్యల గురించి తెలుసుకోవాల్సి ఉందని ఐరాస పేర్కొంది. అందుకోసం ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది.
గర్భనిరోధక సాధనాలు, పునరుత్పత్తి ఆరోగ్యం, కౌమార గర్భం, బాల్య వివాహాలు, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు మొదలైన వాటిపై అవగాహన కలిగించాలని ఐరాస పేర్కొంది. బాలికా విద్య, బాలికలకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపింది. యువతలో ముఖ్యంగా 15-19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో లైంగిక సంబంధిత సమస్యలను పరిష్కరించడం చాలా అవసరమని పేర్కొంది. సురక్షితమైన, స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ చేయించుకోవడం మానవహక్కుగా పరిగణించాలని తెలిపింది. ఇది లింగ సమానత్వం, మహిళా సాధికారతకూ ప్రధానమైనదని ఐరాస పేర్కొంది. పేదరికాన్ని తగ్గించడంలో కీలకమైన అంశం కుటుంబ నియంత్రణ అని అభిప్రాయపడింది. అందుకే ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా బాధ్యత తీసుకోవాలని తెలిపింది. ఫలితంగా ఈ చర్యలన్నీ సమాజంలో ఆర్థికాభివద్ధి జరగడానికి వీలవుతుందని వివరించింది.
కుటుంబ ప్రణాళికను ఈసారి ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణయించింది. దీంతో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవహక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది.

2050 నాటికి ఎంతో తెలుసా ?
ఐక్యరాజ్య సమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకుముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దష్టి సారించే రోజు. ప్రతి ఏడాది ప్రపంచ జనాభాలో దాదాపు 83 మిలియన్ల మంది ప్రజలు చేరుతున్నారని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. మీడియం-వేరియంట్ ప్రొజెక్షన్ ప్రకారం, సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతూనే ఉంటాయని భావించారు. అయినప్పటికీ, ప్రపంచ జనాభా 2030లో 8.6 బిలియన్లకు, 2050లో 9.8 బిలియన్లకు, 2100లో 11.2 బిలియన్లకు చేరుతుందని అంచనా.
యూఎన్‌ఎఫ్‌పిఎ గణాంకాలు..
- కెన్యా, డెన్మార్క్ ప్రభుత్వాలు కూడా ప్రపంచ జనాభాను నిలబెట్టే లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాలను వేగవంతం చేయడానికి నవంబర్‌లో నైరోబీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నాయి.
- చైనా ప్రస్తుత జనాభా 142.57 కోట్లు.
- మనదేశ జనాభాలో 14 ఏళ్లలోపు వారు 25 శాతం ఉండగా.. చైనాలో 17 శాతం.
- 10 - 19 ఏళ్లలోపు వారు మన జనసంఖ్యలో 18 శాతం మంది ఉన్నారు. చైనాలో వీరి సంఖ్య 12 శాతం.
- మనదేశంలో 10 - 24 ఏళ్లలోపు వారు 26 శాతం ఉండగా.. చైనీయుల్లో వీరు 18 శాతం.
- 15 - 64 ఏళ్ల వయసులో ఉన్నవారి సంఖ్య మనదేశంలో 68 శాతం ఉండగా.. చైనాలో 69 శాతం.
- మన జనాభాలో 65 ఏళ్లు దాటినవారి సంఖ్య ఏడు శాతం కాగా.. చైనాలో అది 14 శాతం.
- కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో వద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో యువత సంఖ్య ఎక్కువగా ఉంది.
జనాభా 80 లక్షలు.. భాషలు 800..
పపువా న్యూ గినీ.. ఆస్ట్రేలియా సమీపంలో పర్వతాలతో నిండిన చిన్న దేశం. ఈ దేశ జనాభా కేవలం 80 లక్షలు. కానీ, ఇక్కడ దాదాపు 800 భాషలు వాడుకలో ఉన్నాయి. కొన్ని శతాబ్దాలుగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మనుగడ సాగిస్తున్న తెగలు ఇక్కడ అనేకం. అందువల్ల పురాతన మూలాలు కలిగిన అనేక భాషలు ఇంకా ఇక్కడ మనుగడలో ఉన్నాయి. ఇక్కడ 800కు పైగా భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. వాటిలో వేల సంఖ్యలో మాత్రమే మాట్లాడే కెరెవో లాంటి భాషలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేటికి 20 శాతం జనాభా మాత్రమే పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే వలస పాలకుల వల్ల టాక్ పిసిన్ భాష పుట్టింది. ఇవాళ పిడ్‌జిన్ ఇంగ్లీష్ ఇక్కడ చాలా విస్తృతంగా ఉపయోగించే భాషగా మారింది. మరోవైపు కెరెవో లాంటి భాషను మాట్లాడే ప్రజలు కేవలం కొన్ని వేల మందే మిగిలారు.

వీళ్లు ప్రత్యేకం..
ఓరుషీ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే యుఎన్ ప్రకారం.. ప్రపంచ జనాభా 700 కోట్లనే అంకెను చేరినప్పుడు పుట్టిన పుట్టిన చిన్నారుల్లో ఈమె ఒకరు. 11 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ఓరుషీ బంగ్లాదేశ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆ దేశ జనాభా సుమారు కోటి 70 లక్షలు. అదింకా పెరుగుతోంది. 1999లో ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకున్నప్పుడు పుట్టిన చిన్నారిలో అద్నాన్ మెవిక్‌కు అప్పటి ఐక్యరాజ్య సమితి ప్రధానకార్యదర్శి కోఫీ అన్నన్ పేరు పెట్టారు. 2080 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకోవచ్చని యుఎన్ అంచనా వేస్తోంది.
మీకు తెలుసా ?
- ప్రపంచ జనాభా 1800ల ప్రారంభం వరకు వంద కోట్లు, ఇప్పుడు ప్రతి 12-15 సంవత్సరాలకు వందకోట్లు జోడించబడుతోంది.
- చైనాను 2024 నాటికి వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది.
- ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న జనాభా నైజీరియాలో కనిపిస్తోంది.
- ప్రస్తుత జనాభా పెరుగుదల రేటు ప్రకారం, 2050 నాటికి మనుగడ కోసం మరో భూమి అవసరమయ్యేలా ఉంది.
- మన జనాభా 1970లో ఉన్న దానికంటే రెండింతలు ఎక్కువ.
- ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో నిమిషానికి 250 మంది పిల్లలు పుడుతున్నారు.
- మనిషి జీవనాయుర్దాయం 2010-2015 మధ్య 67 నుంచి 71కి పెరిగింది. ఇది 2045-50 మధ్య 77, 2095-2100 మధ్య 83 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా.
- ఐరోపా జనాభా మాత్రమే 2017 కంటే 2050లో తక్కువగా ఉంటుందని అంచనా.

థీమ్ 2023...
ప్రపంచ జనాభా దినోత్సవం 2023 యొక్క థీమ్ ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడం. జులై, 11, 1987 ప్రపంచ జనాభా ఐదు వందల కోట్ల మార్కును దాటిన తేదీని సూచిస్తుంది. వివిధ జనాభా సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. ఈ సమస్యలలో కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యంతో పాటు ప్రాథమిక మానవ హక్కులు ఉన్నాయి.
- శాంతిశ్రీ
8333818985