Aug 13,2023 22:25

- పోలీసుల మోహరింపుతో భయాందోళనలు
ముంబయి : మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. థానేలోని కల్వాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు అనుమానస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేశారు. దీంతో స్థానిక ప్రజానీకంలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో 18 మంది చనిపోయిన విషయాన్ని పురపాలక శాఖ కమిషనరు అభిజిత్‌ బంగార్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. వీరిలో 10 మంది మహిళలున్నారు. మృతుల్లో థానేకి చెందినవారు ఆరుగురు, కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్‌ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్‌, గోవండి (ముంబయి) నుంచి ఒక్కొక్కరు ఉన్నారని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. వీరిలో 12 మంది 50 ఏళ్లు పైబడినవారేనని వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆరా తీశారని, మరణాలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తునకు ఆదేశించామని కమిషనర్‌ తెలిపారు. అయితే ఆసుపత్రిలో వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేయడంతో నగర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, న్యుమోనియా తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నవారే చనిపోయినవారిలో అత్యధికులని కమిషనర్‌ పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగులు చనిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. సాధారణంగా రోజూవారీ అందే సమాచారం ప్రకారం ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఆరేడు మంది చనిపోతుంటారని, అయితే 24 గంటల్లో 18 మంది చనిపోవడం అసాధారణమని థానే డిసిపి గనేశ్‌ గావ్డే చెప్పారు. పెద్ద సంఖ్యలో మరణాల నేపథ్యంలో ఆస్పత్రి వద్ద అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పెద్దయెత్తున పోలీసులు మోహరించినట్టు ఆయన వెల్లడించారు.