
- ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేత
- కొన్నిచోట్ల షాపులను తెరిపించిన వైసిపి నేతలు
- తిరిగిన బస్సులు
ప్రజాశక్తి- యంత్రాంగం : చంద్రబాబునాయుడి అరెస్ట్‌కు నిరసనగా టిడిపి పిలుపుమేరకు సోమవారంం రాష్ట్ర బంద్ చెదురు ముదరు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ముందుజాగ్రత్త చర్యగా అదివారం అర్ధరాత్రి నుండే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టిడిపి, జనసేన నాయకులను పోలీసులు నిర్బంధించారు. రోడ్లమీదకు వచ్చిన వారిని సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. అరెస్ట్‌లను ప్రతిఘటించడంతో కొన్ని జిల్లాల్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే మూసివేశారు. కొన్ని జిల్లాల్లో బ్యాంకులు, ఎల్‌ఐసి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు ఆర్‌టిసి డిపోల ముందు బైటాయించడంతో ఉదయం పది గంటల వరకూ బస్సులు తిరగలేదు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆర్‌టిసి బస్సులు తిరిగినా ప్రయాణికులు పెద్దగా లేరుప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం తగ్గింది. చిరువ్యాపారులు షాపులను మూసివేసినా కొన్ని చోట్ల వైసిపి నాయకులు, కార్యకర్తలు బలవంతంగా తెరిపించారు. చిత్తూరు, వైఎస్‌ఆర్, అన్నమయ్య, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల్లో షాపులను వైసిపి నాయకులు, పోలీసులు దగ్గరుండి తెరిపించారని టిడిపి నాయకులు ఆరోపించారు దాదాపుగా అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.కర్నూలు, . బంద్‌కు జనసేన పార్టీ, సిపిఐ, లోక్‌సత్తా పార్టీ, జైబీమ్ పార్టీ, ఎంఆర్‌పిఎస్, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుడిపల్లిలో రోడ్డుపై వంట-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో టిడిపి నాయకులను, కార్యకర్తలను అష్టదిగ్బంధం చేసి బంద్‌ను విఫలం చేయడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నించింది. అయినా బంద్ ప్రభావం కనిపించింది. పోలీసులతో జరిగిన వాగ్వివాదం, తోపులాటలో ప్రొద్దుటూరు సీనియర్ టిడిపి నాయకులు వరదరాజులరెడ్డి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. దీంతో, ఆయనను ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో మూసిన షాపులను మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, వైసిపి నాయకులు తెరిపించడంతో వివాదానికి దారి తీసింది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలు సెల్ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. వినుకొండ, గురజాల తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్‌టిసి బస్సులపై రాళ్లు రువ్వారు. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత వెంకటాపురంలో పోలీసుల గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని రామగిరి వైపు వెళ్లారు. నసనకోట వద్ద ఆమెను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
సిపిఎం, సిపిఐ నేతల పరమార్శ
బంద్ సందర్భంగా అరెస్టయి పోలీస్ స్టేషన్లలో ఉన్న టిడిపి, జనసేన నాయకులను, కార్యకర్తలను విజయవాడలో సిపిఎం, సిపిఐ నేతలు పరమార్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.వి.కృష్ణ, డి.కాశీనాథ్, సిపిఐ నాయకులు వనజ, కోటేశ్వరరావు, శంకర్, రావుల వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
17 మంది మృతి చెందారు : టిడిపి
చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది టిడిపి కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందారని టిడిపి ఒక ప్రకటనలో పేర్కొంది. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, భావోద్వేగాలకు గురికావొద్దని కోరారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మరో సమావేశం జరిగింది. సిపిఐ నేతలు పరమార్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.వి.కృష్ణ, డి.కాశీనాథ్, సిపిఐ నాయకులు వనజ, కోటేశ్వరరావు, శంకర్, రావుల వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.