Jul 24,2023 10:14

జెరూసలెం : న్యాయ వ్యవస్థలో మార్పులపై కీలక ఓటింగ్‌ జరగడానికి ముందు ఇజ్రాయిల్‌ అంతటా నిరసనలు హౌరెత్తాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దంటూ ఇజ్రాయిలీయులు చేస్తున్న ఆందోళన 29వ వారానికి చేరుకుంది. ప్రభుత్వ నిర్ణయాలను, నియామకాలను సమీక్షించే కోర్టు అధికారాలను తొలగిస్తూ నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ సంస్కరణల బిల్లుపై పార్లమెంట్‌ (నేెసెట్‌)లో సోమవారం తుది ఓటింగ్‌కు రానున్నది. నెతన్యాహు నేతృత్వంలోని జాతీయవాద, మతతత్వ కూటమికి పార్లమెంటులో మెజార్టీ ఉన్నందున దీనిని బుల్డోజ్‌ చేసే అవకాశముంది. జెరూసలెంలో 35 వేల మంది టెల్‌ అవీవ్‌ నుంచి 70 కి.మీ పొడవునా పాదయాత్ర నిర్వహించారు. శని, ఆది వారాల్లో దేశవ్యాపితంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్లమెంటు ఎదుట, అలాగే వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాల వద్ద వేలాది మంది నిరసనకారులు గుమికూడి ఈ బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. వీరికి ఇజ్రాయిలీ మిలిటరీ రిజర్విస్టులు కూడా మద్దతు పలికారు. పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పదివేల మంది మిలిటరీ రిజర్విస్టులు విధుల బహిష్కరణకు మద్దతుగా సంతకాలు చేశారు. మరో వైపు ఇజ్రాయిల్‌లోని అతిపెద్ద లేబర్‌ యూనియన్‌ సార్వత్రిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తే, నెతన్యాహు ప్రభుత్వ నిరంకుశత్వానికి అడ్డు అదుపు ఉండదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు మాత్రం ఈ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని మొండికేశారు. రాజకీయ అంశౄల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం వల్ల పాలన సజావుగా సాగడం లేదని, న్యాయ వ్యవస్థ బలీయమైన శక్తిగా ఎదిగేందుకు యత్నిస్తున్నందున దాని అధికారాలకు పరిమితులు విధించాల్సి వస్తోందని ఆయన వాదిస్తున్నారు.