
పుణే : మహారాష్ట్రలోని జిల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన ఘటనకు వ్యతిరేకంగా సోమవారం అనేక మరాఠా సంస్థలు నిరసనలు నిర్వహించాయి. పుణే జిల్లాలోని బారామతి పట్టణంలో భారీ ఎత్తున ఈ నిరసనలు జరిగాయి. ఏక్‌నాథ్ షిండే-బిజెపి కూటమి ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బయటకు రావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పూణే నగరంలోని కోత్రుడ్ ప్రాంతంలోనూ ప్రతిపక్ష శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్‌పవార్ గ్రూపు), కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేశాయి. మరాఠా ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బిజెపి నాయుకుడు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఏడాది నుంచి ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటున్నా.. మరాఠా రిజర్వేషన్ల కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని విమర్శించారు. మరాఠాల ఆందోళనను బలవంతంగా అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, శుక్రవారం జిల్నా జిల్లాలోని అంతర్వాలి సారధి గ్రామంలో మరాఠా రిజర్వేషన్లకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జి, టియర్‌గ్యాస్ షెల్స్ ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.