Jul 22,2023 10:06
  • మహిళలను వివస్త్రలను చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడాన్ని ఖండిస్తూ ఐద్వా, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనలు తెలిపారు. మణిపూర్‌ మారణహోమాన్ని ఆపాలని, కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని, మహిళలపై అమానుషకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... అల్లర్లతో మణిపూర్‌ అట్టుడుకుతుంటే ప్రధాని మోడీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. దేశం తలదించుకునే విధంగా దేశంలో బిజెపి పాలన సాగుతోందన్నారు. అత్యంత దారుణంగా మహిళలను నగంగా ఊరేగించి, వారిపై అత్యాచారం చేసి, హత్య చేయడం బిజెపి నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. అత్యంత పాశవికమైన చర్య పట్ల మోడీ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. వెంటనే మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలోని రామకృష్ణా నగర్‌ నుంచి రాజీవ్‌ నగర్‌ కాలనీ వరకు ప్రదర్శన చేశారు. కర్నూలులో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. నందికొట్కూరులో మణిపూర్‌ సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నంద్యాలలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయం నుంచి జ్యోతిరావ్‌ఫూలే విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి సత్రం సెంటర్‌ వరకూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
       విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తిరుపతిలోని కొర్లగుంటలో ధర్నా చేశారు. ప్రకాశం జిల్లా బాపట్లలో విద్యార్థినులు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సుందరయ్య నగర్‌లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
        విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ మణిపూర్‌లో అల్లర్లను అదుపుచేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవాని, పిఒడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.