ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ఇండోర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..మొయినాబాద్ మండలం సురంగల్ రెవెన్యూ పరిధిలోని ఫైర్‌ఫాక్స్ టెన్నిస్ స్టేడియంలో ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో బీహార్, కలకత్తాకు చెందిన 12 మంది కూలీలు పనిచేస్తున్నారు. పనిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆడిటోరియం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కార్మికులు బాబ్లూ(35), సునీల్(30) అక్కడికక్కడే మృతిచెందారు. 12 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా లను వెలికి తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న పది మంది కార్మికులను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రంగా తెలిపారు.