Aug 05,2023 11:31

కొమరాడ (విజయనగరం) : టెక్నాలజీ పరుగులు తీస్తున్న కాలంలో ఉన్నా .... ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేక వెనుకబడిన గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ప్రపంచంతో కలిసి ఉన్నా... దూరంగా ఉన్నట్లు ఎలాంటి వసతులకు, సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయి. ఓ పాప ఆరోగ్యం విషమించడంతో ఆ పాప తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి కట్టెల పడవపై నాగావళి నదిపై ప్రయాణించారు. కొమరాడ మండలం చోలపదం పంచాయితీలో రెబ్బ గ్రామస్తులు వారి ప్రాణాలను పణంగా పెట్టి అనారోగ్యంతో ఉన్న పాపని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు పీకల్లోతు నిండుగా పారుతున్న నాగావళి నదిలో కట్టెలతో చేసిన పడవపై ఆ పాపను తీసుకెళ్లారు. కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు, రోడ్డు, ప్రాథమిక ఆసుపత్రి కూడా లేవంటే అతిశయోక్తి కాదు.. ఇప్పటికీ ఎన్నో గ్రామాల ఆదివాసీలు, గిరిజనులు, పలు గ్రామస్తులు డోలీలపై ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని పట్టణ ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్న వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి.. వినిపిస్తూనే ఉన్నాయి.. ఇలాంటి హృదయవిదారక ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నా... వారిని పట్టించుకునే దిక్కే లేదు..!