Aug 17,2023 07:21
  •  షిప్‌యార్డుకు సుమారు రూ.19 వేల కోట్ల కాంట్రాక్టు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)కు అత్యంత కీలకమైన ఐదు ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల నిర్మాణ కాంట్రాక్టుకు ఎట్టకేలకు క్లియరెన్స్‌ వచ్చింది. 2013 సంవత్సరం నుంచి ఈ కాంట్రాక్టు కోసం హెచ్‌ఎస్‌ఎల్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. షిప్‌ బిల్డింగ్‌, రిపేర్లలో ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యం ఈ ప్రభుత్వరంగ సంస్థకు ఉంది. నౌకలు, సబ్‌మెరైన్‌ల తయారీలో స్వదేశీ పరిజ్ఞానం సొంతం చేసుకుంది. అయినా, ఈ కాంట్రాక్టును ఇచ్చే విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాన్చుతూ వచ్చింది. దీంతో, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ.19 వేల కోట్ల విలువైన ఐదు ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల నిర్మాణ కాంట్రాక్టుకు కేంద్ర కేబినెట్‌ కమిటీ సెక్యూరిటీ (సిసిఎస్‌) ఎట్టకేలకు అనుమతులిచ్చింది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో షిప్‌యార్డు సిఎండి హేమంత్‌ ఖత్రీ హుటాహుటిన ఈ నెల 15న ఢిల్లీకి పయనమయ్యారు. షిప్‌యార్డు 2021-22లో రూ.755 కోట్లు, 2022-23లో రూ.1000 కోట్లు టర్నోవర్‌ సాధించింది. 2023-24లో రూ.1500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.