ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖలోని కైలాసపురం సాగరమాల కన్వెన్షన్ సెంటర్‌లో తొమ్మిదో రోజ్‌ఘర్ మేళా కార్యక్రమం మంగళవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. విశాఖలో 163 మందికి ఆరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. వీటిలో తపాలా శాఖలోనే 119 ఉద్యోగాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా పది లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. చంద్రయాన్-3 విజయవంతంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.రాములు, కస్టమ్స్ చీఫ్ కమిషనర్ రుషి గోయల్, జిఎస్‌టి కమిషనర్ ఎంఆర్‌ఆర్.రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారంతా ప్రధాన మంత్రి వీడియో సందేశాన్ని తిలకించారు.