Aug 12,2023 12:21

అమరావతి : తిరుమల అలిపిరి మార్గంలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమని, టిటిడి మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని టిడిపి అధినేత చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు. నిన్న రాత్రి తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారిని చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఈరోజు ఉదయం పోలీసుల గాలింపులో ఆ పాప మృతదేహం కనిపించింది. ఇది తిరుమలలో జరిగిన రెండో ఘటన.

'' కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళుతున్న ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళ ముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టిటిడి మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలి '' అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

11