Nov 07,2023 08:28

తుని పట్టణం (తిరుమల) : తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా పేలి పొగలు రావడం కలకలం రేపింది. ప్రయాణికులు, ఆర్పీఎఫ్‌, రైల్వే అధికారుల కథనం మేరకు ... విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలుదేరిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుని స్టేషన్‌లో ఆగింది. తిరిగి రైలు బయలుదేరుతున్న సమయంలో ఎస్‌ 3 బోగీలోని మరుగుదొడ్డి వద్ద ఉన్న సంచిలో నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురై రైలు నుండి కిందికి దిగేందుకు ప్రయత్నించారు. కొందరు చైను లాగి రైలును ఆపారు. వెంటనే బాణసంచా పేలకుండా ప్రయాణికులు కాళ్లతో తొక్కి ఆ సంచిని బయట పడేశారు. అప్పటికే బోగీలో చిన్నగా పొగ వస్తుండటంతో సంచిని కాళ్లతో తొక్కి పొగను అదుపు చేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్‌, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. తరువాత రైలు బయలుదేరింది. ట్రాక్‌ పక్కన పడి ఉన్న బాణసంచా (చిన్న చిచ్చుబుడ్డులు)ను జీఆర్పీ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా జీఆర్పీ సిబ్బంది మాట్లాడుతూ ... గుర్తుతెలియని ప్రయాణికుడు ఓ సంచిలో బాణసంచా, మందులు (ఔషధాలు) తీసుకువెళుతుండగా స్వల్ప పేలుడు సంభవించిందని తెలిపారు. రైలులో పరిస్థితి సద్దుమణగడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.