ప్రజాశక్తి-తిరుమల : టీటీడీ ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు (ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్) విధానాన్ని గురువారం టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో 8 వేలకు పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 10 వేలకు పైగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరందరికీ ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తామని తెలిపారు. దీనివల్ల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, పని సామర్థ్యం పెరుగుతాయని చెప్పారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తామని వెల్లడించారు. ఈ విధానం వల్ల కొందరు ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఐటి జనరల్ మేనేజర్ సందీప్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.