- దోషులను శిక్షించడానికి సాధ్యమైనదంతా చేశాం : లోక్‌సభలో ప్రధాని మోడీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో త్వరలో శాంతిని నెలకొల్పుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ సుదీర్థంగా 2.13 గంటల పాటు మాట్లాడారు. మణిపూర్‌లో మారణకాండకు బాధ్యత వహించడానికి బదులు ప్రతిపక్షాలపై దాడికే ఆయన సమయాన్నంతా వెచ్చించారు. 'ఈశాన్య రాష్ట్రాల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ ఎన్నడూ ప్రయత్నించలేదు. నేను 50 సార్లు సందర్శించాను. మణిపూర్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని అనుమతించనప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది, పాఠశాలల్లో జాతీయ గీతాన్ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు మణిపూర్‌లో ఎవరి ప్రభుత్వం ఉంది?... వారి (ప్రతిపక్ష) బాధ సెలెక్టివ్. వారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించలేరు... నిందితులను శిక్షించి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. మణిపూర్ ప్రజలకు దేశం మొత్తం అండగా ఉంటుందని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. దోషులను శిక్షించడానికి ప్రభుత్వం సాధ్యమైనదంతా చేస్తుంది. త్వరలో శాంతి నెలకొంటుందని మణిపూర్ ప్రజలకు భరోసా ఇస్తున్నాను. ఈశాన్య రాష్ట్రాల సమస్యలన్నింటికీ మూలం కాంగ్రెస్ మునుపటి విధానాల్లోనే ఉంది. ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తుంది. ఎందుకంటే దేశంలోని ప్రజలు తమపై, దేశంపై నమ్మకం ఉంచడం ప్రారంభించారు. ప్రజల విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయవద్దు'' అని మోడీ ఎప్పటిలానే తన వాగాడంబరాన్ని ప్రదర్శించారు.
ప్రతిపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని అన్నారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న మోడీ, తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని అన్నారు. 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారని అన్నారు.
ప్రజలకు చేరువైన అభివృద్ధి ఫలాలు : నిర్మలా సీతారామన్
అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.14 గంటల పాటు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవుపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 'వస్తాయి, అందుతాయి' అని ప్రజలు ఎదురు చూసేవారని, ప్రస్తుతం 'వచ్చాయి. అందాయి' అని ప్రజలు అంటున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి టమాటాలను సేకరించి, ఎన్‌సిసిఎఫ్, ఎన్‌ఎఎఫ్‌ఈడి వంటి సహకార సంస్థల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతున్నట్లు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో హౌల్‌సేల్ మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైందన్నారు. ఆంక్షలు సడలించి నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్, తదితర చోట్ల మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
లోక్‌సభలో అధిర్ రంజన్‌పై సస్పెన్షన్ వేటు
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రుల ప్రసంగానికి భంగం కలిగించారని సభ నుంచి కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేయాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్నిప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు ఆయనను సభకు రానీయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. లోక్‌సభలో ప్రతిపక్షనేతను సస్పెండ్ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ ''వాకౌట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే మణిపూర్ సమస్యపై ప్రధాని 'నిరవ్'గానే ఉన్నారు. కాబట్టి, కొత్త 'నీరవ్ మోడీ'ని చూసి ఏం లాభం అనుకున్నాను. దేశం మొత్తం తన వెంటే ఉందని ప్రధాని మోడీ చెబుతున్నా కాంగ్రెస్‌కు ఎందుకు భయపడుతున్నారు'' అని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర హౌం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సభను తప్పుతోవ పట్టించారని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ నోటీసులు స్పీకర్‌కు అందజేశారు. 'అవిశ్వాస'మే ప్రధానిని సభకు రప్పించింది : అధిర్ రంజన్ అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి బిజెపిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా బుధవారం చేసిన 'క్విట్ ఇండియా' వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కాషాయీకరణ క్విట్ ఇండియా అని స్పష్టంచేశారు. కాషాయీకరణ, పోలరైజేషన్, మతతత్వం భారత దేశం నుంచి వెళ్లిపోవాలన్నారు. అవిశ్వాస తీర్మానం చాలా శక్తిమంతమైనదని, ప్రధాన మంత్రిని పార్లమెంట్‌కు తీసుకొచ్చింది వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము అనుకోలేదన్నారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌కు రావాలని, మణిపూర్ సమస్యపై మాట్లాడాలని మాత్రమే తాము డిమాండ్ చేశామన్నారు. దృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఆయన పాలనలో నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగిందని, నేడు కూడా రాజు గుడ్డివాడిగా కూర్చున్నారని, మణిపూర్, హస్తినాపూర్ మధ్య తేడా ఏమీ లేదని మోడీని దుయ్యబట్టారు. దీంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభ్యంతరం తెలిపారు. అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా వెంటనే స్పందిస్తూ, మోడీని ఉద్దేశించిన ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మణిపూర్ సమస్య కేవలం ఓ రాష్ట్రానికి పరిమితం కాదని, ఇది ఇప్పటికే అంతర్జాతీయ కోణాన్ని సంతరించుకుందని చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి జోక్యం తప్పనిసరి అని అన్నారు.