- నీటి ప్రవాహం తగ్గిపోవడంతో బయటపడ్డ 2 వేల ఏళ్ళనాటి రాతి చిత్రాలు !
బ్రసిలియా : అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతంలో గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో సంభవించిన అతి తీవ్రమైన కరువుతో రికార్డు స్థాయిలో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. అయితే దీనివల్ల అద్భుతమైన విషయం ఒకటి బయటపడింది. మానవ ముఖాలు చెక్కిన రాళ్ళు అనేకం అక్కడ బయటపడ్డాయి. వీటిలో కొన్ని ముఖాలు గుండ్రంగా, మరికొన్ని చతురస్రాకారంగా చెక్కి వున్నాయి. రాతిపై చెక్కిన ఇవన్నీ దాదాపు 2వేల ఏళ్ళ నాటివని భావిస్తున్నారు. గతంలో కూడా ఇలా రాతిపై చెక్కిన చిత్రాలు కొన్ని బయటపడినా ఈసారి పెద్ద సంఖ్యలో, అది కూడా చాలా రకాలుగా రాతి చిత్రాలు బయల్పడడం విశేషం. వీటి మూలాలను నిర్ధారించేలా పరిశోధనలు చేయడానికి పరిశోధకులకు ఇవి బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్త జైమె డీ శాంతనొ అలీవెయిరా చెప్పారు. యురోపియన్లు ఇక్కడకు రావడానికి చాలా ఏళ్ళు ముందుగానే ఇక్కడ నివసించే ఆదివాసీలు తమ విల్లులను, పారలను పదును చేసుకోవడానికి ఉపయోగించిన ప్రాంతంగా భావించే ఏరియా కూడా బయటపడింది. ఈ చెక్కడాలన్నీ కూడా చరిత్ర పూర్వం లేదా వలస పాలనకు పూర్వ కాలానివిగా భావిస్తున్నట్లు అలీవెయిరా చెప్పారు. వాటి కాలాన్ని కచ్చితంగా చెప్పలేం, కానీ ఈ ప్రాంతంలో మానవుల సంచారానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకుని చూస్తే ఇవి 2వేల ఏళ్ళనాటివని భావిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్ నదికి ఉత్తర తీరంలో రియో నీగ్రో, సోలిమోస్ నదులు సంగమించే ఈ ప్రాంతాన్ని పాంటో డాస్ లాజెస్‌గా పిలుస్తారు. ఇక్కడ రాళ్లపై చెక్కిన దృశ్యాలను 2010లో మొదటగా చూశారు. కానీ ఈ ఏడాది కరువు చాలా తీవ్రంగా వుంది. దాంతో రియో నీగ్రోలో జులై నుండి దాదాపు 49.2 అడుగుల మేరా నీరు తగ్గిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో రాళ్ళు, ఇసుక బయటపడ్డాయి.