Sep 01,2023 13:01

వాషింగ్టన్‌ :  ఇకపై ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్‌ నుండి పనిచేయాలని అమెజాన్‌ శుక్రవారం ఆదేశించింది. ఉద్యోగులు విభేదించినప్పటికీ... నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అమెజాన్‌ సిఇఒ ఆండీ జస్సే పేర్కొన్నారు. ఆగస్టులో జరిగిన అంతర్గత సమావేశంలో వచ్చిన వ్యాఖ్యలను ఇన్‌సైడర్‌ అనే వార్తా సంస్థ మొదట నివేదించింది.

మే నుండి వేలాది మంది ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించాలని అమెజాన్‌ యత్నిస్తున్నట్లు జస్సే ఫిబ్రవరి 17న బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఉద్యోగులు కార్యాలయంలో వర్క్‌ చేసినప్పుడు మెరుగైన సహాకారంతో పాటు మరింత శిక్షణ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకరి నుండి మరొకరు వ్యక్తిగతంగా నేర్చుకోవడం సులభంగా వుంటుందని, ఎదురైన సవాలును ఎలా పరిష్కరించారో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు.

ఈ ఏడాది అమెజాన్‌ 25,000 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మెటా, గూగుల్‌, ఎక్స్‌ (ట్విటర్‌) జూమ్‌ వంటి టెక్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించాయి. ఇక కార్యాలయాలకు రావాలని, కనీసం వారంలో మూడు రోజులైనా ఆఫీసు నుండి పనిచేయాలని ఆదేశిస్తున్నాయి.