Dec 02,2022 16:54

సిడ్నీ   :   ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియా  వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రికీ పాంటింగ్‌ ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మూడో రోజు ఆటకు  కామెంట్రీ చెబుతుండగా  ఛాతీ నొప్పిగా  ఉన్నట్లు చెప్పారని  మీడియా తెలిపింది. వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. దీంతో అతను ఈ రోజు కామెంట్రీ బాక్స్‌కు దూరమయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. అయితే కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. పాంటింగ్‌ అస్వస్థతకు గురవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రీడాకారులు రాడ్‌ మార్ష్‌, షేన్‌ వార్న్‌లు ఈ ఏడాది మార్చిలో మరణించిన సంగతి తెలిసిందే.