Oct 03,2023 11:41

నాందేడ్‌: మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేరోజు 24 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉన్నారు. ఆసుపత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో సోమవారం సాయంత్రానికి గత 24గంటల వ్యవధిలో 24 మంది మరణించారని, వీరిలో 12మంది నవజాతా శిశువులు ఆసుపత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ వెల్లడించారు. వివిధ రకాల వ్యాధులు, ముఖ్యంగా పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఆసుపత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు చెప్పారు. ఈ దారుణంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (బిజెపి, ఏక్‌నాథ్‌ షిండే- శివసేన, ఎన్‌సిపి- అజిత్‌ పవార్‌ గ్రూపు) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
 

                                                         కఠిన చర్యలు తీసుకోండి: సుప్రియా సూలే

ఆసుపత్రిలో ఒకేరోజు 12మంది నవజాత శిశువులతో పాటు 24మంది మరణించిన ఘటనను ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు ఖచ్చితంగా యాదృచ్చికం కాదని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రాణాలంటే అంత చులకనా? అని మండిపడ్డారు. ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో మందులు అందడంలేదని రోగులు వాపోతున్నారని చెప్పారు. ఈ ఘటనలో కఠిన చర్య తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు. సంబంధిత మంత్రులతో రాజీనామా చేయించాలని, అలాగే, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.