- పిపిపిలోకి తాజాగా పోర్టు ఆస్పత్రి సహా ఆరు ఎకరాలు
- రూ.261 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
- 5 రోజుల్లో ఆమోదం రానుంది : పిపిపి అధికారులు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ పోర్టు భూములు ఒక్కొక్కటిగా ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. పోర్టు ట్రస్ట్ ఆస్తులు పిపిపి ముసుగులో దారాదత్తం అవుతున్నాయి. ఇప్పటికే పోర్టులోని 26 బెర్తుల్లో 11 బెర్తులను పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ (పిపిపి)కి ఇచ్చేశారు. ఇటీవలే ఇంటర్నేషనల్ సంస్థ రహేజా మాల్‌కు రూ.400 కోట్ల విలువైన 17 ఎకరాలను పోర్టు అధికారులు కేవలం రూ.150 కోట్లకే లీజుకు కట్టబెట్టారు. తాజాగా వైజాగ్ పోర్టు ట్రస్ట్ (విపిటి) ఆస్పత్రి ఎకరన్నర సహా, చుట్టూ ప్రాంగణంగా ఉన్న మరో నాలుగున్నర ఎకరాలు కలిపి ఆరు ఎకరాలను పిపిపి కింద బహిరంగ మార్కెట్లో పెట్టాలని పోర్టు అథారిటీ నిర్ణయించింది. ఆస్పత్రిని అభివృద్ధి చేసే పేరిట రూ.261 కోట్లతో పిపిపిలో కేంద్ర ప్రభుత్వానికి తాజాగా పిపిపి విభాగ అధికారులు ప్రతిపాదించారు. పోర్టుకు సంబంధించిన స్థలాలు, బెర్తులన్నిటినీ శరవేగంగా లీజుకు ఇచ్చే దిశగా పిపిపి విభాగం క్రియాశీలంగా పనిచేస్తోంది. నెల రోజుల్లోపే పోర్టు ఆస్పత్రి పిపిపికి ఆమోద ముద్ర లభించనుందని అధికారులు చెప్తున్నారు.
దేశంలో 4 మేజర్ పోర్టు ఆసుపత్రులూ పిపిపిలోనే..
కేంద్రంలోని బిజెపి సర్కారు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అత్యంత వేగంగా ప్రభుత్వ రంగ సంస్థలను పిపిపి మోడ్‌లోకి చేర్చి ఆస్తులను ధారాదత్తం చేసే పనిని తీవ్రతరం చేసింది. ఇప్పటికే దేశంలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ (జెఎన్‌పిటి), న్యూ మంగలూరు, ముంబయి, కొల్‌కతా ట్యూటికోరన్ పోర్టులకు చెందిన ఆస్పత్రులను, స్థలాలను కేంద్రం పిపిపికి ఇచ్చేసింది. ఇవి టెండర్ల దశలో ఉండగా, వైజాగ్ పోర్టు ట్రస్ట్ ఆస్పత్రి పిపిపి కోసం ప్రతిపాదనలు చేసింది. 15 రోజుల్లో ఆమోదం రానుందని, త్వరలో విపిటి ఆస్పత్రి కూడా టెండర్ల దశకు చేరనుందని పోర్టులోని పిపిపి అధికారులు 'ప్రజాశక్తి'కి వెల్లడించారు.
ఆల్ ఇన్ వన్ రూఫ్
'ఆల్ ఇన్ వన్ రూఫ్' (ఒకే గొడుగు కింద పలు కార్యకలాపాలు) అనే నినాదంతో పిపిపిలో పోర్టు ఆస్పత్రి నిర్మాణం సరికొత్తగా జరగనుందని పిపిపి అధికారులు చెబుతున్నారు. మల్టీ స్పెషాలిటీ, మల్టీ డిసిప్లిన్ 300 బెడ్స్ ఆస్పత్రికి 32 మంది ప్రత్యేక వైద్య నిపుణులతో ముందుకెళ్లనున్నట్లు పేర్కొంటున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన
పోర్టు ఆస్పత్రిని పిపిపిలోకి పెట్టడంపై నగర ప్రజానీకం, పోర్టు ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన పోర్టు స్థలాలను పిపిపి పేర కార్పొరేట్లకు కట్టబెడితే పోర్టు మొత్తం అనతి కాలంలోనే కబ్జాకు గురవుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోర్టు రిటైర్డ్ ఉద్యోగులైన పెన్షనర్లు సుమారు 13,000 మంది, ఉద్యోగులు 2,000 మంది వైద్య సేవల కోసం ప్రస్తుత ఈ ఆస్పత్రిపై ఆధారపడుతున్నారు. పిపిపికి ఇచ్చేశాక ఆస్పత్రిలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం కింద వైద్య సేవలు సిజిహెచ్‌ఎస్ ఛార్జీలతో వీరందరికీ అందుతాయని పోర్టు యాజమాన్యం చెబుతోంది. విశాఖ వాసులెవరైనా ఈ ఆస్పత్రిలో వైద్యానికి రావొచ్చని, వారికి బహిరంగ మార్కెట్లో ఆయా వైద్య ఖర్చులు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగానే ఖర్చులు భరించాల్సి ఉంటుందని వెల్లడించారు.