పంట చేతికొచ్చే సమయంలో అమెరికా యాపిల్స్‌పై సుంకం తగ్గింపు
మోడీ ప్రభుత్వ నిర్ణయంతో పెట్టుబడులూ దక్కవంటున్న రైతులు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో యాపిల్ పంట దిగుమతి కాలం సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి రైతులపై పిడుగులా పడింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌పై టారిఫ్‌ను 20 శాతాన్ని కేంద్రం తగ్గించడం జమ్ముకాశ్మీర్ రైతులకు అశనిపాతంగా మారనుంది. ఇప్పటికే పంట సాగు వ్యయం పెరగడం, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లేకపోవడం, సరైన మద్దతు ధర లేకపోవడం, దళారుల దోపిడీ, అననకూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు వంటి వాటితో కష్టాలు పడుతున్న రైతులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. ప్రీమియమ్ వాషింగ్టన్ యాపిల్స్‌పై 2019 నుంచి అమల్లో ఉన్న 70 శాతం సుంకంలో 20 శాతం తగ్గిస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ - బైడెన్ ద్వైపాక్షిక సమావేశానికి ముందు దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ నిర్ణయం ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చింది. యాపిల్స్, వాల్‌నట్స్, లెంటిల్స్, చిక్‌పీస్ వంటి అనేక అమెరికా ఉత్పత్తులపై ఈ నోటిఫికేషన్ పన్ను మినహాయింపులను ప్రకటించింది.
జమ్ముకాశ్మీర్‌కు చెందిన యాపిల్ తోటల పెంపకందార్లు, వ్యాపారుల సమాచారం ప్రకారం రాష్ట్రంలో యాపిల్ పంట చేతికొచ్చే సమయంలోనే వాషింగ్టన్ యాపిల్స్ కూడా మార్కెట్లోకి వస్తాయి. ఇది స్థానిక పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుంది. జమ్ముకాశ్మీర్ యాపిల్ పరిశ్రమపై ఆధారపడి సుమారు 30 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరిపై కేంద్ర నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది.
విదేశీ ప్రశంసల కోసం కాశ్మీరీలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రం
'అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే యాపిల్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. కొన్నేళ్ల నుంచి దిగుబడి కూడా పడిపోయింది. అమెరికా నుంచి దిగుమతి యాపిల్స్‌పై పన్ను తగ్గింపు జమ్ముకాశ్మీర్ రైతులనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులను కూడా దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి' అని కాశ్మీర్‌లోని యాపిల్ రైతులు, వ్యాపారుల సంఘం ఆల్ వ్యాలీ ఫ్రూట్ గ్రోవర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ (ఎవిఎఫ్‌జిడిఎ) అధ్యక్షులు బషీర్ అహ్మద్ బషీర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రస్తుత జమ్ముకాశ్మీర్ పరిపాలనా యంత్రాంగానికి, జమ్ముకాశ్మీర్ ప్రజలకు మధ్య సత్సంబంధాలు లేవనే విషయాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని చెప్పారు. 'అమెరికా, ఇతర దేశాలను సంతోషపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలపై కష్టాలను మోపుతోంది. వేదనలకు గురిచేస్తోంది' అని అబ్దుల్లా విమర్శించారు.
భారత దేశపు యాపిల్ బుట్టగా జమ్ముకాశ్మీర్
భారత దేశపు యాపిల్ బుట్టగా జమ్ముకాశ్మీర్‌గా పేరుగాంచింది. గత ఏడాది సీజన్‌లో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్ పళ్లను జమ్ముకాశ్మీర్ ఉత్పతి చేసింది. ఇది మొత్తం భారత దేశంలో ఉత్పత్తి చేయబడిన యాపిల్స్‌లో 70 శాతానికి కంటే ఎక్కువ. ఈ ఉత్పత్తితో జమ్ముకాశ్మీర్ సుమారు 14 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను అమెరికా సుమారు 25 శాతం పెంచింది. దీనికి ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్ వంటి వాటిపై సుంకాలను పెంచింది. దీంతో అమెరికా నుంచి యాపిల్స్ దిగుమతులు భారీగా తగ్గాయి. 2018-19లో అమెరికా నుంచి సుమారు 145.2 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్స్ దిగుమతి కాగా, 2022-23కు 5.27 మిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రసుత్తం భారత్‌కు అతిపెద్ద యాపిల్ ఎగుమతి దారుగా టర్కీ అవతరించింది. దేశానికి దిగుమతయ్యే యాపిల్స్‌లో 84 శాతం టర్కీ నుంచే వస్తున్నాయి. తరువాత స్థానాల్లో ఇటలీ, చిలీ, ఇరాన్ దేశాలు ఉన్నాయి.
ప్రస్తుత సీజన్‌లో జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో అకాల వర్షాలు, వరదల కారణంగా సుమారు 50 శాతం యాపిల్స్ సాగు తగ్గింది. యాపిల్ చెట్లకు బూజు, తెగుళ్లు వంటి వ్యాధులు వ్యాపించాయి. దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన రైతుకు అమెరికా నుంచి యాపిల్స్ రాక మరింత నష్టాన్ని కలుగజేయనుంది. స్థానిక యాపిల్స్‌కు కిలోకు కనీసం రూ.100 తగ్గుతుందని రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. యాపిల్ సాగులో అధునాతన సాంకేతిక వినియోగం, అక్కడి ప్రభుత్వాలు అందించే రాయితీలతో అమెరికా రైతులు అభివృద్ధి చెందుతున్నారని జమ్ముకాశ్మీర్ రైతులు తెలిపారు. అమెరికా యాపిల్‌తో దేశీయ రకాల యాపిల్స్ పోటీ పడలేవని చెప్పారు. ధరలు తగ్గడంతో తమకు పెట్టుబడి సొమ్ము కూడా తిరిగి రాలేదని తెలిపారు. జపాన్ నుంచి వచ్చే బియ్యం దిగుమతులపై 100 శాతం సెస్ విధిస్తున్న కేంద్రం, అమెరికా యాపిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని రైతులు తప్పుపడుతున్నారు.
పిఎంఒ జోక్యం చేసుకోవాలి : ముఫ్తీ
అమెరికా యాపిల్స్ దిగుమతి సుంకం తగ్గింపు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) జోక్యం చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. 'కేంద్రం నిర్ణయం జమ్ముకాశ్మీర్‌లోని సాగుదారులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపుతుంది. వీరు 2019 నుంచి భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పిఎంఒ పున్ణపరిశీలించాలి' అని ముఫ్తీ ట్వీట్ చేశారు.
సుంకాల తగ్గింపును వెనక్కి తీసుకోవాలి : తరిగామి
అమెరికా యాపిల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం నాయకులు మహ్మద్ యూసుఫ్ తరిగామి డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్ రైతులు కొన్నేళ్ల నుంచి భారీ నష్టాలతో సతమతమవుతున్నారని, ఈ నిర్ణయంతో వారి కష్టాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి, పెట్టుబడి ఖర్చులు కూడా రాబట్టుకోలేని స్థితిలో రైతులు ఉన్నారని తెలిపారు.