Sep 12,2023 11:22

 అమెరికన్‌ యాపిల్స్‌పై దిగుమతి సుంకం కోత వద్దు

 తప్పుబట్టిన రైతు సంఘాలు

న్యూఢిల్లీ: భారత్‌లో జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ పర్యటనకు ముందు అమెరికా బాదం, యాపిల్స్‌, వాల్‌నట్‌లు, పప్పులపై దిగుమతి సుంకాలు తగ్గించిన అంశంపై రైతు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రం నిర్ణయం ప్రకారం.. వాషింగ్టన్‌ యాపిల్స్‌పై దిగుమతి సుంకాలను 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. కనీస మద్దతుపై కొనుగోళ్లు లేకపోవడంతో ఇప్పటికే వాతావరణ మార్పు, బహిరంగ మార్కెట్‌లో దోపిడీ ధరల కష్టాలతో పోరాడుతున్న తరుణంలో యాపిల్స్‌, మసూర్‌ పప్పుపై దిగుమతి సుంకాలు తగ్గించడం వారి జీవితాలపై విపత్కర ప్రభావాన్ని చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ''వాతావరణం అనుకూలంగా ఉంటే నేను కొంత లాభం పొందవచ్చు. గత సీజన్‌లో క్వింటాల్‌కు రూ.3,200 చొప్పున విక్రయించాను. ఇక్కడ ఎంఎస్‌పీ సేకరణ లేదు. ధరలు మరింత తగ్గితే మనం ఎలా బతకాలి?'' అని మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు సురేంద్ర సింగ్‌ వాపోయారు. యాపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సోహన్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. దిగుమతి సుంకం తగ్గింపు యొక్క తక్షణ ప్రభావం భారత మార్కెట్లో చౌకైన వాషింగ్టన్‌ ఆపిల్‌లను డంప్‌ చేయడానికి దారితీస్తుందని అన్నారు. ''భారత మార్కెట్‌లో దాదాపు రూ. 6,000 కోట్ల వరకు యాపిల్స్‌ను డంప్‌ చేస్తారని మా అంచనా. హిమాచల్‌ ప్రదేశ్‌ రైతులు ప్రతి సంవత్సరం ఇంత విలువైన యాపిల్స్‌ను ఉత్పత్తి చేస్తారు''అని ఆయన అన్నారు. వాషింగ్టన్‌ యాపిల్‌ పెంపకందారులు అసాధారణమైన రాయితీలను పొందుతారని ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు. అమెరికన్‌ యాపిల్‌ పెంపకందారులు తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయించటమూ మంచి లాభాలను ఆర్జించడానికి ప్రధాన కారణమని తెలిపారు. ''అమెరికన్‌ యాపిల్‌ పెంపకందారులు ఫెడరల్‌, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 32 శాతం రాయితీలను పొందుతున్నారని డేటా సూచిస్తున్నది. అయితే భారతీయ యాపిల్‌ పెంపకందారులు వరుసగా ప్రభుత్వాల ఉదాసీనతను నిరంతరం చూస్తున్నారు. 1991లో మేము ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు వంటి వివిధ విషయాలపై మొత్తం 9 శాతం సబ్సిడీలను పొందాము. ఇది 2023లో 2.5 శాతానికి తగ్గింది'' అని ఠాకూర్‌ అన్నారు.భారతదేశంలో 10 లక్షల కుటుంబాలు తమ తోటల్లో యాపిల్‌ పండిస్తున్నాయని ఠాకూర్‌ చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు లక్షల కుటుంబాలు, జమ్మూ కాశ్మీర్‌లో ఏడు లక్షల కుటుంబాలు యాపిల్‌ సాగుపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. యునైటెడ్‌ స్టేట్స్‌లోని వార్తా కథనాలను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం 1,400 మంది యాపిల్‌ పెంపకందారులు మాత్రమే భారతదేశం నుంచి వ్యాపార భాగాన్ని తీసుకుంటారని సూచిస్తున్నారు.