- కౌలు చెల్లించనందుకు తుళ్లూరులో నిరసన
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా):రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన తమకు ఈ ఏడాది ఇప్పటి వరకు వార్షిక కౌలు చెల్లించకపోవడంతో మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీపై శుక్రవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. వార్షిక కౌలు చెల్లింపులో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ రైతులు, మహిళలు మండిపడ్డారు. తుళ్లూరు రైతు దీక్షా శిబిరం వద్ద నుంచి పోలీస్ స్టేషన్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల కౌలు సొమ్మును సిఎఫ్‌ఎంఎస్‌లో అప్లోడ్ అయినట్లు చూపినా ఆరు నెలలుగా రైతుల ఖాతాల్లో జమకావడం లేదని తెలిపారు. కౌలు సొమ్ము జమ చేయడంలో అలసత్వం వహించే అధికారులపై పోరాడతామని రైతులు హెచ్చరించారు. తక్షణమే కౌలు చెల్లించాలని స్టేషన్ వద్ద నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 22,736 మంది రైతులకు కౌలు పరిహారం చెల్లించాల్సి ఉండగా, మూడు నెలల క్రితం కోర్టును ఆశ్రయించిన 2400 మందికి మాత్రమే కౌలు సొమ్ము చెల్లించారు. మిగతా వారికి చెల్లించకపోవడంతో ఇటీవల హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దసరా సెలవుల అనంతరం విచారిస్తామని కోర్టు రైతులకు తెలిపింది. ఈ నేపధ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.