ప్రజాశక్తి - మాచర్ల (పల్నాడు జిల్లా):అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గొట్టిపాళ్లకు చెందిన మారాజి మార్కండేయ (40) తనకున్న 1.25 ఎకరాల సొంత పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి పంటలు సాగుచేసేవారు. గత కొన్నేళ్లగా వర్షాభావం, చీడపీడలతో పంటలు చేతికందకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక దుర్గి మండలం అడిగోప్పుల గ్రామానికి కుటుంబం సహా వలస వెళ్లి అక్కడే కూలి పనులు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ సొంతూరుకు వచ్చి పొలాన్ని చూసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గొట్టిపాళ్లకు వచ్చిన మార్కండేయ తన పొలానికి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మార్కండేయకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.