Aug 26,2023 15:40

శ్రీనగర్‌ :   సుప్రీంకోర్టులో ఆర్టికల్‌ 370 రద్దును ప్రశ్నించిన కాశ్మీర్‌ లెక్చరర్‌పై మోడీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జమ్ముకాశ్మీర్‌కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష చర్యను సవాలు చేస్తూ   వాదించిన  కాశ్మీర్ లెక్చరర్   జహూర్‌ అహ్మద్‌  భట్  పై  వేటు వేసింది.   బుధవారం సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించారు.  నాలుగు రోజుల అనంతరం  కేంద్ర పాలిత విద్యా విభాగం నుండి ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌  ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 

'' జమ్ము కాశ్మీర్‌ సివిల్‌ సర్వీస్‌ రెగ్యులేషన్స్‌, జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు మరియు జెకె లీవ్‌ రూల్స్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పాఠశాల విద్యాశాఖ పొలిటికల్‌ సైన్స్‌ సీనియర్‌ లెక్చరర్‌ జహూర్‌ అహ్మద్‌ భట్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నాం'' అంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ఓప్రకటనలో పేర్కొంది. ''సస్పెన్షన్‌ సమయంలో ఆయన జమ్మూ డైరెక్టర్‌ స్యూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో అటాచ్‌ చేయబడతారు'' అని ప్రకటన పేర్కొంది. అలాగే జహూర్‌ అహ్మద్‌ ప్రవర్తనపై విచారణ జరపాలని జమ్ములోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుబహ్  మెహతాను ఎల్‌జి ప్రభుత్వం ఆదేశించింది.

న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జహూర్‌ అహ్మద్‌  భట్‌ బుధవారం సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై ఆర్టికల్‌ 370 రద్దును సవాలుచేస్తూ ఆరు నిమిషాల పాటు  వాదనలు వినిపించారు.

'' జెకెలో నేను ఇండియన్‌ పాలిటిక్స్‌ గురించి విద్యార్థులకు వివరిస్తాను. 2019 నుండి మన దేశ రాజ్యాంగం గురించి బోధించడం నాకు చాలా కష్టంగా ఉంది. 2019 తర్వాత మనది ప్రజాస్వామ్యమా అని విద్యార్థులు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం కష్టం. ఆర్టికల్‌ 370ని రద్దు చేయబోమని ఆగస్ట్‌ 4న అప్పటి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ హామీ ఇచ్చినప్పటికీ.. అర్థరాత్రి కర్ఫ్యూ విధించారు. మాజీ ముఖ్యమంత్రులను నిర్బంధించారు '' అని భట్‌ సుప్రీంకోర్టులో పేర్కొన్నారు.

జెకె ప్రత్యేక హోదాను రద్దు చేయడమే కాకుండా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం ''భారత రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమే '' అని ఆయన వాదించారు. ప్రజల సమ్మతిని పరిగణనలోకి తీసుకోకుండా జెకె మరియు లడఖ్‌లుగా విభజించడం ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ చర్య సహకార ఫెడరలిజానికి మరియు రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు.

రాష్ట్రపతికి ఆర్టికల్‌ 370కి సంబంధించి అప్పటి గవర్నర్‌ సిఫారసులు చేసిన సమయంలో శాసన మండలి కూడా ఉందని వాదించారు. ''జెకె అసెంబ్లీ రద్దు చేయబడింది కానీ.. 2019 4,5 తేదీల్లో శాసన మండలి రద్దు కాలేదు. శాసన మండలి ఆమోదం తీసుకునే అవకాశం గవర్నర్‌కు ఉంది. 36 మంది సభ్యుల కౌన్సిల్‌ విస్మరించబడింది. వారిలో చాలా మంది నిర్బంధించబడ్డారు'' అని పేర్కొన్నారు.