Aug 13,2022 06:51

పునరావాసానికి కేంద్ర నిధులు ఇవ్వడంలేదు. రాష్ట్రం పునరావాసం కోసం నిధులు అడగట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వరద పర్యటనలో 41.15 కాంటూరు వరకు పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. అంటే 20,946 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించి చేతులు దులిపేసుకుంటామని చెప్పకనే చెబుతున్నారు. వెరసి కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్వాసితులను ముంచడానికే సిద్ధపడ్డారు.

పోలవరం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి నేడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ వరకు గత పదిహేనేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో అధికారం కోసం ప్రధాన పార్టీల రాజకీయ నినాదం. అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితుల గురించి పట్టించుకున్న పాలకులే లేరు. ఎన్నికల నాడు వాగ్దానాలు కురిపించడం, ఆ తరువాత నిర్వాసితుల హక్కుల్ని గోదాట్లో కలిపేయడం పాలకులకు అలవాటుగా మారిపోయింది. పోలవరం ప్రారంభమయ్యాక దాదాపుగా నలుగురు ముఖ్యమంత్రులు మారి ఐదవ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి అధికారాన్ని వెలగబెట్టాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మారాక కేంద్రంలోని బిజెపితో పాటుగా మొత్తంగా ఈ ప్రభుత్వాలకు, పార్టీలకు ప్రాజెక్టు కట్టడం మీద ఉన్న శ్రద్ధ నిర్వాసితుల మీద లేదు. దాంతో నిర్వాసితుల పునరావాసం మోసంగా మారింది. పరిహారం పరిహాసమైంది. నిర్వాసితుల పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది.
పునరావాసం లేదు ... పరిహారమూ లేదు...
            1986 గోదావరి వరదల్లో 75.6 అడుగుల ఎత్తున వరద నీరు వచ్చింది. 2022లో 72 అడుగులు. 1986 వరదలను మించిన విధ్వంసం ఈసారి జరిగింది. అదీ జులైలో కావడంతో మరింత నష్టం జరిగింది. ఇంతటి భారీ ముంపు, నష్టం ఎందుకు జరిగింది? తప్పుని గోదారమ్మ మీద నెట్టేసి పాలకులు దర్జాగా తప్పుకున్నారు. దీనిని ప్రకృతి ప్రళయం అనేకంటే పాలకులు చేసిన విధ్వంసం అనాలి. పునరావాసం పూర్తి చేయకుండా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేయడం వల్ల గత మూడేళ్లుగా నిర్వాసిత గ్రామాలన్నీ గోదాట్లోనే ఉన్నాయి. చింతూరు, విఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, దేవీపట్నం మండలంలోని నిర్వాసిత గ్రామాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రజలంతా ఇళ్లను, సామగ్రిని వదిలేసి కొండలపైనే తలదాచుకున్న పరిస్థితి. వరద ప్రభావిత గ్రామాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలకు చేయి రాలేదు. ఆహారం, మందులు లేక ఆదివాసీలంతా నానా అవస్థలు పడ్డారు.
              పోలవరం ప్రాజెక్టు కింద మొత్తం 8 మండలాల్లోని 222 పంచాయతీల్లో 373 గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గ్రామాల్లో 1,06,006 కుటుంబాలు నిర్వాసితమయ్యాయని తేల్చారు. ఇది చాలా కాలంగా చెప్తున్న లెక్క. కానీ వాస్తవంలో దాదాపు మరో 100 గ్రామాలు పైనే నీట మునుగుతాయి. కానీ ప్రభుత్వాలు కంటికి కనిపించే వాస్తవం కన్నా కాగితం మీద ఉన్న అంకెలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
                    వి.ఆర్‌.పురం, కూనవరం మండలాల నిర్వాసితుల పునరావాసం కోసం ఎటపాక మండలంలో రాయనపేట గ్రామంలో నిర్వాసిత కాలనీ నిర్మించారు. నిర్వాసిత కాలనీ నిర్మించడమంటే అర్థం అది ముంపు కాని ప్రాంతమని అర్థం. అయితే 2022లో వచ్చిన వరదలకు ఈ నిర్వాసిత కాలనీ మునిగిపోయింది. అలాగే కుక్కునూరు మండలంలోని కివ్వాక గ్రామంలో దాచారం, కివ్వాక, దామచర్ల, ఉప్పేరు గ్రామాల నిర్వాసితుల కోసం పునరావాస కాలనీని నిర్మించారు. ప్రస్తుతం ఈ కాలనీ నీట మునిగింది. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2022లో చాలా పెద్ద వరద వచ్చింది, కాబట్టి ముంపు వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. కాని 2020లో వచ్చిన 62 అడుగుల వరదకు కూడా పునరావాస కాలనీలు మునిగాయి అంటే ముంపు లెక్కలు ఎంతటి కాకి లెక్కలో అర్థమవుతుంది.
                   ఇంకో ఉదాహరణ విఆర్‌.పురం మండలంలో రేఖపల్లి, రాజుపేట గ్రామాలు అసలు ముంపు జాబితాలోనే లేవు. ఎందుకంటే ఇవి మునగవు. కానీ 2020, 2021, 2022 ఈ మూడేళ్ల కాలంలో వరదల సమయంలో ఈ గ్రామాల చుట్టూ నీరు చేరిపోయింది. కాని ఈ గ్రామాలు మునగలేదు. మరి రేపు ప్రాజెక్టులో నీరు నింపినప్పుడు ఏడాది పొడవునా ఈ గ్రామాల చుట్టూ నీరు ఉంటే ఈ గ్రామాల ప్రజలు ఎలా నివసించాలి? అంటే...ఎలాంటి పునరావాసం, పరిహారం లేకుండా తట్టాబుట్ట సర్దుకుని పోవడమేనా? చింతూరు, ఎటపాక మండలాల్లో ఇలాంటివే అనేక గ్రామాలు ఉన్నాయి. అందుకనే ఈ ముంపు గ్రామాల జాబితా తప్పుల తడక అనేది. నిర్వాసితుల జాబితాలో వున్నవారికే పునరావాసం కల్పించలేకపోతే...నిర్వాసిత జాబితాలో లేనివారి సంగతి ఇక చెప్పనే అక్కరలేదు.
కాంటూరు దగా
                కాంటూరు పేరుతో దశలవారీ ముంపు గ్రామాల జాబితా తయారుచేశారు. 41.15 మీటర్లు ఒక దశ, 45.72 మీటర్లు ఒక దశ. కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలేనని సిపిఎంతో పాటు, నిర్వాసిత గ్రామాల ప్రజలు అనేక సార్లు చెప్పినా పట్టించుకోని ప్రభుత్వానికి ఈ వరద లెక్క సరిచేసి చూపింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ముందు తమ గ్రామాలను 45.72 కాంటూర్‌లో కాకుండా 41.15 కాంటూర్‌ కిందకు తీసుకొచ్చి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలను పరిష్కరించాలని విలీన మండలాల ప్రజలు, పోలవరం, దేవీపట్నం మండలాల ప్రజలు పదే పదే అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు వారి విన్నపాలను పట్టించుకోకుండా నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు పోలవరం ముంపు మండలాలన్నీ నీట మునుగుతున్నాయి. 2019కి ముందు దేవీపట్నం, పూడిపల్లి, దామనపల్లి, కొత్తగూడెం, కె.వీరవరం, దేవనపల్లి తదితర గ్రామాలను ప్రభుత్వం 45 కాంటూర్‌లో చేర్చింది. కానీ, 2019 వరదల సమయంలో, ఈ గ్రామాలన్నీ మునిగిపోయాయి. ఈ గ్రామాలను 2020లో 41 కాంటూర్‌ జాబితాలో చేర్చారు. ఇప్పుడు వి.ఆర్‌.పురం లోని 11 గ్రామాలు, కూనవరంలోని బొజ్జరాయి గూడెం ఒక్క గ్రామం మినహా 4 విలీన మండలాల్లోని మిగిలిన ముంపు గ్రామాలను 45 కాంటూర్‌లో చేర్చారు. ప్రస్తుతం వరదల కారణంగా ఎటపాక పోలీస్‌ స్టేషన్‌ మొదలు, కూనవరం బస్టాండ్‌ వరకు, చట్టీ మొదలు ఎర్రంపేట వరకు అన్ని గ్రామాలను వరద ముంచెత్తింది. కుకునూరు గ్రామం అతలాకుతలమైంది. పునరావాసం, పునరావాస ప్యాకేజీ పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవద్దని అనేక మంది నిపుణులు, అనేక తీర్పులు చెప్పినా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి.
పునరావాసం 5 శాతం.. ప్రాజెక్ట్‌ 70 శాతం..
                   ప్రాజెక్టు నిర్మించాలంటే ముందుగా పునరావాసం చేపట్టాలనేది ప్రాథమిక సూత్రం. కాని ఇది పోలవరం విషయంలో ఎక్కడా అమలు కాలేదు. భారత దేశంలో ఇప్పటివరకు ఇన్ని లక్షల కుటుంబాలను ముంచి కట్టిన ప్రాజెక్టు మరొకటి లేదనే చెప్పాలి. మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనా త్రీ గాడ్జెస్‌ ప్రాజెక్టు కంటే ఎక్కువ క్యూసెక్కుల నీరు విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగిన ప్రాజెక్టు అని గొప్పలు చెప్తున్నారు. సరే అంగీకరిద్దాం. మరి పునరావాసం విషయంలో కూడా ప్రంపంచానికి ఆదర్శంగా నిలవాలి కదా?
              ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ప్రాజెక్టు కింద మునిగే 373 గ్రామాలను పునరావాస కాలనీలు నిర్మించి అక్కడికి తరలించాల్సి ఉండగా 2022 జులై నాటికి కేవలం 27 గ్రామాలను మాత్రమే తరలించారు. 1,06,006 కుటుంబాలకు గాను 8,927 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించినట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ 41.15 కాంటూరు పరిధిలోవే. ఆ 41.15 కాంటూరులో కూడా ప్రభుత్వ లెక్క ప్రకారం ఇంకా 12,019 కుటుంబాలకు పునరావాసం కల్పించనే లేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో కూడా రహదారులు, డ్రెయినేజీలు, తాగునీటి ట్యాంకులు, కొళాయిలు, విద్యుత్‌, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్లు, శ్మశానం, ప్రార్థనాలయాలు ఇలా 2013 భూసేకరణ చట్టం చెప్పిన 23 రకాల మౌలిక సదుపాయాలు ఉన్న కాలనీ ఒక్కటీ కూడా కనిపించలేదు. దేవీపట్నం మండలంలోని నిర్వాసితుల కోసం గోకవరం మండలంలోని కృష్ణునిపాలెంలో నిర్మించిన 1,067 ఇళ్ల కాలనీలో కొన్ని ఇళ్లు చిన్నపాటి వర్షానికే కారిపోతున్నాయి. డ్రెయినేజీల నిర్మాణం సరిగా లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. అన్నిటికన్నా ముఖ్యమైనది తరలించబడిన వారికి ఉపాధి లేక నానా అవస్థలు పడటం అత్యంత బాధాకరం.
                నిర్వాసితుల పునరావాసం కోసం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వీటన్నిటికీ కలిపి రూ.33,470.34 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వ అంచనా. 15 ఏళ్లకి 5 శాతం పునరావాసం కూడా పూర్తికాకపోతే మిగిలిన 95 శాతం మందిని గోదాట్లో ముంచుతారా?
                పునరావాసానికి కేంద్ర నిధులు ఇవ్వడంలేదు. రాష్ట్రం పునరావాసం కోసం నిధులు అడగట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వరద పర్యటనలో 41.15 కాంటూరు వరకు పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. అంటే 20,946 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించి చేతులు దులిపేసుకుంటామని చెప్పకనే చెబుతున్నారు. వెరసి కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్వాసితులను ముంచడానికే సిద్ధపడ్డారు. అందుకనే ఈ పునరావాస మోసం పైన పోలవరం నిర్వాసితులకు పోరు తప్ప వేరే మార్గం లేదు. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలను రీ సర్వే చేయాలని, పునరావాసం పూర్తయ్యే వరకూ ప్రాజెక్టు పనులు నిలిపేయాలనే డిమాండ్‌తో నిర్వాసితులంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది. 75 ఏళ్ల స్వాంతంత్య్ర ఉత్సవాలు జరిగుతున్న వేళ మన కళ్ల ముందే 3 లక్షల అమాయక ఆదివాసీ, నిర్వాసితులు జల సమాధి అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయమే అవుతుంది. నిర్వాసితుల పోరుకు యావత్‌ రాష్ట్ర ప్రజానీకం అండగా నిలవాలి.

                                                    పునరావాసానికి కేంద్ర నిధులు ఇవ్వడంలేదు. రాష్ట్రం పునరావాసం కోసం నిధులు అడగట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వరద పర్యటనలో 41.15 కాంటూరు వరకు పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. అంటే 20,946 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించి చేతులు దులిపేసుకుంటామని చెప్పకనే చెబుతున్నారు. వెరసి కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్వాసితులను ముంచడానికే సిద్ధపడ్డారు.
                                     టి. అరుణ్ / వ్యాసకర్త : సిపిఎం జిల్లా కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా,
                                                    సెల్‌ : 9490098837/