ప్రజాశక్తి - పోలవరం : లోయర్, అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న సిఫేజు నీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా రిపేరు చేయడమా, కొత్తది నిర్మించడమా అనేది కేంద్ర జలశక్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వారి నిర్ణయం అనంతరం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. దిగువ, ఎగువ కాఫర్ డ్యాంల మధ్య డి వాటర్ వర్క్స్ జరుగుతున్నాయని, వాటర్ వర్క్స్ అనంతరం వైబ్రో కంపాక్ట్ కాంపౌండ్ మొదలవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో 41.15 కాంటూరు వరకు వేసిన అంచనాలకు నేటికీ ఖర్చు పెరిగిందని, దీని ప్రకారం రూ.31,625 కోట్లు సిడబ్ల్యుసి రివైజ్డ్ కాస్ట్‌కి బిల్లును పంపించామని చెప్పారు. ఈ బిల్లు కేబినెట్‌లో అంగీకరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్ నగదు వస్తుందని, అయితే ప్రస్తుతం ఈ బిల్లు కేబినెట్‌లో పెండింగులో ఉందని తెలిపారు. దీన్నిబట్టి 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 41.15 వరకు పూర్తయ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుండి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనేకసార్లు ప్రధానమంత్రిని కలిసి కోరారన్నారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఎస్‌ఇ సుధాకర్‌బాబు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎస్‌ఇ శ్యామ్‌ప్రసాద్, ఇఇ ఏసుబాబు పాల్గొన్నారు.