Aug 08,2023 20:52
  •  నిర్వాసితులను నీట ముంచిన జగన్‌
  •  23న ఏలూరులో కార్యాచరణ ప్రకటన : రామకృష్ణ

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రశ్నార్ధకమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తు నిర్మాణం జరగాల్సి ఉందని, 45.72 అడుగుల వరకు ఎత్తు తగ్గించి నిర్మాణం చేస్తే ప్రయోజనం ఉండదని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రా ప్రయోజనాలను పక్కనబెట్టి జాతీయ ప్రాజెక్టు ఖర్చులు కేంద్రానికి తగ్గించడానికి చూస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కుట్ర పూరిత నిర్ణయంపై జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 150 అడుగులు ఎత్తు ఉంటే 194 టిఎంసిలు నీటి నిల్వ ఉండే అవకాశం ఉందన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాల జిల్లాలకు నీరందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతోపాటు 940 మెగావాట్ల విద్యుత్‌ శక్తి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముంపు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ఏలూరులో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ వైజాగ్‌లో ప్రారంభం అయ్యే బస్సు యాత్ర సెప్టెంబర్‌ 8వ వరకు వరకు కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు పాల్గొన్నారు.