ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్, కరువు సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరసన దీక్ష పోస్టరును ఆవిష్కరించారు. వారం రోజులపాటు తమ పార్టీ బృందం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని కరువు ప్రాంతాల్లో పంటల పరిశీలన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో 80 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, 24 లక్షల ఎకరాల్లో వేయలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టపర్తి పర్యటనలో కరువు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఏమయ్యారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా 'వై ఎపి నీడ్స్ జగన్' కార్యక్రమంలో ఉండిపోతున్నారని రామకృష్ణ అన్నారు. చిక్ బళ్లాపూర్ రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కూలీలు చనిపోయారని, వలసలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.