Oct 30,2023 10:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నవంబర్‌ 2వ తేదీ నుంచి సిపిఐ రాష్ట్ర సమితి నాయకత్వంలో 18 కరువు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. దాసరి భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలు, కరువు తీవ్రతపై పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించినట్లు చెప్పారు. కృష్ణా జిలాల పునఃపంపిణీపై నవంబర్‌ ఒకటవ తేదీన విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజాసంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని చెప్పారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కరువుపై నోరు మెదపడంలేదన్నారు. తక్షణమే రాష్ట్రప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 8వ తేదీన విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యా సంస్ధల బంద్‌కు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లను రూ.6 వేలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. లిక్కర్‌ అమ్మకాలు, విద్యుత్‌ ఒప్పందాలు, స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్స్‌ కొనుగోలులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో వైసిపి మరో మోసానికి తెరతీసిందన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగు లకు రూ.7 వేలు పెన్షన్‌ ఇవ్వాలని నవంబర్‌ 10న నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని కోరారు.
 

                                                                   రామకృష్ణతో రఘువీరారెడ్డి బేటీ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను సిడబ్ల్యుసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి ఆదివారం విజయవాడలో బేటీ అయ్యారు. ఇండియా కూటమి పటిష్టతపై చర్చించారు.