Oct 19,2023 16:46

ప్రజాశక్తి-గుత్తి(అనంతపురం): వేరుశనగ పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలోని తురకపల్లి, కొజ్జేపల్లి గ్రామాల్లోని నాగన్న, బాలన్న అనే రైతులు సాగుచేసిన వేరుశనగ పంట పొలాలను గురువారం సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేస్తే వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంను కరువు జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, మండల కార్యదర్శి జి.రామదాసు, నాయకులు మధు, రామాంజనేయులు, ఉమర్‌ భాష, గోపీనాథ్‌, దేవేంద్ర, రమేష్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.