Aug 24,2023 08:26
  •  ప్రశ్నార్థకంగా డ్యామ్‌ భద్రత
  •  సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
  •  ఏలూరుకు చేరిన సిపిఐ బస్సు యాత్ర

ప్రజాశక్తి - ఏలూరుప్రతినిధి/అర్బన్‌ : పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పుడే ప్రాజెక్టు పూర్తయినట్లని, నిర్వాసితులకు పరిహారం అందించకుండా గోదావరిలో ముంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. 'రాష్ట్రాన్ని రక్షించండి- దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం ఏలూరు జిల్లా కేంద్రానికి చేరుకుంది. పోలవరం నిర్వాసితుల సమస్యలపై నగరంలోని టుబాకో మర్చంట్స్‌ కల్యాణ మండపంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టిడిపి నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకూ 22 శాతం మాత్రమే పరిహారం అందించారని, డ్యామ్‌ మాత్రం 70 శాతం పూర్తి చేశారన్నారు. నిధులు రాబట్టడంలో కేంద్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి పెంచకుంటే పోలవరం నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రాజెక్టు డ్యామ్‌ ప్రమాదంలో పడిందని, ప్రపంచస్థాయి నిపుణులతో తనిఖీ చేయించి నష్టపరిహారాన్ని కాంట్రాక్టర్ల వద్ద వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యంలో తొలిముద్దాయి మోడీ ప్రభుత్వమే అని విమర్శించారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి నిర్వాసితులను గోదావరిలో ముంచారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు కేటాయిస్తే నాలుగేళ్లలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదన్నారు. పోలవరం నిర్వాసితులు 1.06 లక్షల కుటుంబాలుంటే కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామనడం దుర్మార్గమన్నారు. అనంతరం బస్సు యాత్ర జంగారెడ్డిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా జెపి సెంటర్‌లో జరిగిన బహిరంగసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు.