
ఫ్రాన్స్‌లో రిటైర్మెంట్ వయసు పెంపకం, ఇజ్రాయెల్‌లో న్యాయ సంస్కరణల పేరుతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కడం, జర్మనీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం, కెన్యాలో అధిక ధరలతో సతమతం కావడం, యుద్ధం కారణంగా అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయం భరించలేకపోవడం...ఇలా ఒక్కో దేశంలో ఒక్కో కారణం కనిపిస్తున్నా, అన్నింటా స్పష్టమయ్యేది పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల దివాళాకోరుతనమే. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తున్న స్థితిలో ప్రజలను మరింత పీడించేందుకు ఆయా దేశాల్లో పాలకులు యత్నిస్తున్నారు. ప్రజలపై భారాలు మోపుతూ కార్పోరేట్ల లాభాలు తగ్గకుండా చూస్తున్నారు. ఓవైపు ఆర్థిక సంక్షోభ ఛాయలు అలముకుంటున్నా బడాబాబుల లాభాలకు ఢోకా లేకుండా చూస్తున్న ప్రభుత్వాల తీరు మూలంగానే ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సమ్మెలకు చోటు లేదని చెప్పిన దేశాల్లోనే మొత్తం వ్యవస్థను స్తంభింపజేసే రీతిలో ఇప్పుడు కార్మికవర్గం కదులుతోంది. పైన పేర్కొన్న దేశాల్లోనే కాకుండా ఇంగ్లాండ్, బెల్జియం, పోలెండ్...అనేక యూరప్ దేశాల్లో రోజుల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో సైతం కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రపంచం నలుమూలలా ఆందోళనల అలజడి రేగుతోంది. కార్మిక పోరాటాల తీవ్రత పెరుగుతోంది. వరుస సమ్మెలతో ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
- కుదిపేస్తున్న సమ్మెలు
సోవియట్ యూనియన్ పతనానంతరం 1990ల నుంచి నయా ఉదారవాద విధానాలు జోరందుకుంటున్నాయి. అన్ని దేశాల్లోనూ కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బతీసే ప్రయత్నాలు పెరిగాయి. యూనియన్లకు, సమ్మెలకు అవకాశం లేకుండా చేసిన దేశాలు కూడా ఉన్నాయి. అయినా గానీ 2000 సంవత్సరం ఆరంభంలో సియాటెల్ వంటి ప్రాంతాల్లో మొదలయ్యి ప్రపంచ సామాజిక వేదికల పేరుతో పోరాడే శక్తులు మళ్లీ కొంత ప్రయత్నం చేశాయి. కానీ కోవిడ్ తర్వాత ఇప్పుడు ప్రపంచ బడా ఆర్థిక వ్యవస్థలు మాంద్యం దిశలో పయనిస్తుండడం ప్రజలకు పెనుభారం అవుతోంది. అంతిమంగా దానిని సహించలేని కార్మికులు మరోసారి తమ నిరసనను సమ్మెల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. జర్మనీలో దేశవ్యాప్త సమ్మె జరగడంతో గతవారం రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇంత భారీ సమ్మె నిర్వహించడం 1992 తర్వాత ఇదే మొదటిసారి. మొత్తం విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. బస్సులు, ఇతర మోటారు వాహనాలు ఆగిపోయాయి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన సవరణ కోసమంటూ దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు ఐక్యంగా ఇచ్చిన పిలుపుతో 24 గంటల సమ్మె చరిత్రకెక్కింది. జర్మనీకి ముందు నుంచే మరో పెద్ద దేశం ఇంగ్లాండ్ లోనూ తీవ్రస్థాయిలో ఉద్యమాలు సాగుతున్నాయి. రైల్వే, పోస్టల్, హెల్త్ సర్వీసుల్లో పనిచేసే కార్మికులంతా సమ్మెకి దిగడం, 15 లక్షల మంది రోడ్డు మీద నిరసనలకు దిగడం ఈ ఏడాది ఆరంభంలోనే జరిగింది.
- అణచివేత
ఓవైపు సమ్మెలు, ఉద్యమాల తాకిడి పెరుగుతుండడంతో ఆయా పెట్టుబడిదారీ ప్రభుత్వాలు తీవ్ర అణచివేతకు పాల్పడుతున్నాయి. చైనాలో జీరో కోవిడ్‌ని నిరసిస్తూ కొందరు రోడ్డు మీదకు రాగానే ప్రపంచ పెట్టుబడిదారీ మీడియా గగ్గోలు పెట్టింది. చైనా ప్రభుత్వం వెంటనే తన విధానంలోని లోపాలను సవరించుకుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని చాటిచెప్పింది.
అదే సమయంలో ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఉద్యమం వీధి పోరాటాన్ని తలపిస్తోంది. అక్కడ రిటైర్మెంట్ వయసుని 62 నుంచి 64కి పెంచడం ద్వారా ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపు వాయిదా వేయవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది ఉద్యోగాల కల్పన మీద, వృద్ధాప్యంలో పనిభారం మీద ప్రభావం చూపుతుందంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువత, విద్యార్థులు కూడా కార్మికులతో చేతులు కలిపారు. ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. దేశం స్తంభించింది. పారిస్ మహానగరంలో వీధి పోరాటాలను తలపించే స్థాయిలో మంట చెలరేగింది. ప్రభుత్వం మాత్రం ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి పార్లమెంట్‌లో చట్టం రూపొందించడానికి సిద్ధపడింది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అధ్యక్షుడు తన విశేషాధికారాన్ని వినియోగించి చట్టం చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్యమం మరింత తీవ్రతరమైంది. ఉద్యమంపై మాక్రాన్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అందరికీ ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పే పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజల గొంతుని ఎంతగా అణచివేస్తారన్నది సోషల్ మీడియాలో వీడియోలు చాటుతున్నాయి.
ఫ్రాన్స్‌లో మాత్రమే కాదు..ఇజ్రాయెల్‌లో సైతం ఇదే తంతు. మోడీ మిత్రుడు నెతన్యాహూ అక్కడ ప్రధానమంత్రిగా ఎన్నికయిన తర్వాత న్యాయ వ్యవస్థ పరిధిని కుదించే పనికి పూనుకున్నారు. సరిగ్గా మన దేశంలో న్యాయశాఖ మంత్రి, ఉప రాష్ట్రపతి భారత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు మీద దాడి చేస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్‌లో న్యాయ సంస్కరణల పేరుతో సర్వహక్కులు తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. చివరకు రక్షణమంత్రి సైతం వ్యతిరేకతను వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ప్రజల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు పాలస్తీనా, ఇరాన్ వంటి దేశాలతో పాటు సిరియా మీద కూడా దాడులు చేస్తూ జనం దృష్టిని మళ్లించే యత్నం చేసింది. అయినా అక్కడి జనం నిర్బంధాన్ని ఎదిరించి ముందుకు సాగుతున్నారు.
- భారాలు సహించలేక...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడం యూరప్ ప్రజల కష్టాలను తీవ్రం చేస్తోంది. పిల్లికి చెలగాటం- ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్టుగా మారుతోంది. అమెరికా, యురోపియన్ పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం రష్యాతో వైరం కొనితెచ్చుకుని ఏడాదిగా దానిని కొనసాగించడానికి ఆపసోపాలు పడుతున్నారు. యుద్ధం పుణ్యమా అని ఆహారం, ఇంధనం ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వాటి భారాన్ని యూరప్ దేశాల ప్రజలు సహించలేకపోతున్నారు. రోడ్డెక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, యుద్ధానికి సహకరించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.
యూరప్‌తో పాటుగా యుద్ధం కారణంగా అత్యధికంగా నష్టపోతున్న ఆఫ్రికా ప్రజల పరిస్థితి మరీ దారుణం. ఆఫ్రికన్ ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నారు. ఆహారం ధరలు పెరిగిపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్న కెన్యా ప్రజలు దేశ రాజధానిలో ప్రభుత్వ దళాలతో తలబడ్డారు. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అమెరికన్ ఆయుధ, ఆయిల్ కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. కానీ పెరిగిన ధరలతో సామాన్య అమెరికన్లు అల్లాడిపోతున్నారు. ఓవైపు ఉపాధి కోల్పోవడం, మరోవైపు పెరిగిన ఆర్థిక భారం కలిసి వారిని ఇక్కట్ల పాలుజేస్తున్నాయి. ఐఎంఎఫ్ విధానాలను నెత్తికెత్తుకుని శ్రీలంక ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. తాజాగా పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం కూడా మహమ్మారి వ్యాపించడం, ఆ తర్వాత తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టడం, చివరకు సమ్మెల వెల్లువని నివారించేందుకు నియంతృత్వ ఫాసిస్టు పోకడలు ప్రబలడం, అంతిమంగా అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీయడం వంటి అనుభవాలున్నాయి. చరిత్ర పునరావృతమవుతుందా? ఓవైపు ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో చైనా ప్రభావం పెరుగుతోంది. అమెరికన్ ఆధిపత్యానికి మూలమైన డాలర్‌కు బదులు లోకల్ కరెన్సీకి ప్రాంతీయ ఆర్థిక కూటములు మొగ్గు చూపుతున్నాయి. డాలర్ స్థానంలో యువాన్ సహా వివిధ కరెన్సీలు ముందుకొస్తున్నాయి. దాంతో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయి.
- అమీన్