Nov 23,2022 16:42
  •  సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ పిలుపు

ప్రజాశక్తి-విశాఖ: కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీసవేతనం 26వేలు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధిరక్షణకై ఐక్య పోరాటాలకు కార్మికులంతా సిద్దం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ పిలుపునిచ్చారు. ఎంవిపి గిరిజన భవనంలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ 9వ మహాసభ జరిగింది. ఈ మహాసభ ప్రారంభంగా ఆంధ్రా యూనివర్శిటీ సీనియర్‌ నాయకులు ఎస్‌.మాధవస్వామి జెండావిష్కరణ చేసారు. మహాసభకు అధ్యక్షవర్గంగా వి.కృష్ణారావు, కె.కుమారి, జె.ఆర్‌.నాయుడులు వ్యవహరించారు. ముఖ్యవక్తలుగా ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, కుమార్‌మంగళం హాజరయ్యారు. మహాసభను కుమార్‌ ప్రారంభిస్తూ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామన్న ప్రభుత్వం మాటతప్పిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం ఇవ్వాలని ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని కేవలం 6వేల నుండి 12వేల రూపాయలు మాత్రమే కాంట్రాక్ట్‌ కార్మికులకు చెల్లించి దోపిడీచేస్తున్నాయన్నారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ వలన కార్మికుడికి అనేక హక్కులు కోల్పోతున్నారన్నారు. కనీసవేతనాల బోర్డు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా సహకరించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేనలు పల్లెత్తుమాట కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం నేటికి 650 రోజులుగా కొనసాగుతున్నా మోడీ విశాఖకు వచ్చి ఏమీ మాట్లాడలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఆధారంగా తోపుడుబండ్లు, ముఠా, బిల్డింగ్‌, ఆటో, షాప్స్‌, హోటల్స్‌ వంటి కార్మికులు స్వయంఉపాధితో జీవిస్తున్నా వారికి ఉపాధిరక్షణ లేకుండా ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు దాడులు చేస్తున్నారన్నారు. కార్మికుల హక్కుల సాధనకోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహాసభలో కార్యదర్శి పి.వెంకటరావు మూడేళ్లు కాలంలో నిర్వహించిన పోరాటాలు`విజయాలపై నివేదిక ప్రవేశపెట్టారు. మహాసభ కార్యదర్శి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించింది. నూతన అధ్యక్ష, కార్యదర్శులు జె.ఆర్‌.నాయుడు (మున్సిపల్‌), పి.వెంకటరావు, ఆఫీస్‌ బేరర్స్‌గా రామారావు (ఆర్టీసి), బి.కృష్ణ (ముఠా), వరలక్ష్మి (జివిఎంసి), ఎ.సింహాచలం (తోపుడుబండ్లు), సిహెచ్‌ పార్వతి (హాస్పిటల్స్‌), ఆలీ (ఆటో) ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 15 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
కళాకారులు పాటలు పాడుతూ మహాసభ ప్రతినిధులను ఉత్సాహపర్చారు. ప్రారంభానికి ముందే ఈ మూడేళ్ళ కాలంలో మరణించిన కార్మికవర్గ నాయకులకు, ప్రజాస్వామ్యవాదులకు మహాసభ ఘనంగా నివాళిర్పించింది.