Jun 30,2023 10:14

ప్రజాశక్తి-బాపట్ల : ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే పాట తెలుగు నాట ప్రతి నోట పాడించి జాతీయతా భావాలను పెంపొందించిన దేశభక్తకవి రాయప్రోలు సుబ్బారావు అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ కొనియాడారు. రాయప్రోలు సుబ్బారావు పెద్ద నందిపాడు సమీపంలోని గార్లపాడు గ్రామంలో జన్మించినా బాపట్లలో చాలా కాలం ఉన్నారని తెలియజేశారు. వారు తృణ కంకణము, కష్టకమల, తెలుగు తోట, ఆంధ్రావని వంటి గొప్ప రచనలు చేశారని పేర్కొన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన రాయప్రోలు సుబ్బారావు 39వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీవేత్త ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్ కాలేజీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు భాష ఉపన్యాసకులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తించి తెలుగు భాష ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని వారు చేసిన కృషికి సారస్వత పురోహిత్ అనే బిరుదు కూడా ప్రదానం చేయబడినదని ప్రశంసించారు .వారు కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో కూడా సత్కరింపబడ్డారని తెలియజేశారు.  సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ రాయప్రోలు సుబ్బారావు నవ్య కవితా పితామహులని, తెలుగు భావ కవిత్వ ఆద్యులు అని ,ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశారని తెలుగు సాహిత్య అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని వివరించారు. ఈ సభలో మర్రి మాల్యాద్రి రావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, ఎం జాకబ్,  ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, తదితరులు రాయప్రోలు సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.