Feb 02,2021 00:25

పమాదంలో నుజ్జునుజ్జయిన కారు 


నడిగడ్డ వద్ద చెట్టును ఢకొీన్న కారు
మరో ఇద్దరికి స్వల్పగాయాలు
ప్రజాశక్తి-వినుకొండ
రోడ్డు ప్రమాదంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అనుచరుడు మృతి చెందగా ఇరువురు వ్యక్తులు గాయపడిన ఘటన మండలంలోని శివాపురం నడిగడ్డ అడ్డరోడ్డు గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు చెందిన కారులో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రధాన అనుచరులు పాండురంగారావు(55), నజీర్‌ అహ్మద్‌ వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి మార్కాపురానికి వెళ్తుండగా మార్గమధ్యలో నడిగడ్డ మలుపు వద్ద ఓ యువకుడు ద్విచక్రవాహనంతో అడ్డురావడంతో అతడిని తప్పించబోయి డ్రైవర్‌ పక్కనున్న చెట్టును ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో పాండురంగారావు అక్కడికక్కడే మృతి చెందగా నజీర్‌ అహ్మద్‌, డ్రైవర్‌ శ్రీనివాసరావుకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను, మృతదేహాన్ని 108లో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు పాండురంగారావు మార్కాపురంలో బోర్‌వెల్స్‌ వ్యాపారి. సమాచారం తెలుసు కున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఘటనాస్థలిని సందర్శించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితుడు నజీర్‌ అహ్మద్‌, డ్రైవర్‌ను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.