Feb 11,2021 23:30

వివరాలు వెల్లడిస్తున్న సిఐ శ్రీనివాసరావు

అక్రమంగా తరలించి విక్రయిస్తున్న సూపర్‌వైజర్‌
ప్రజాశక్తి-వినుకొండ:
పట్టణంలోని ముళ్ళమూరు బస్టాండ్‌ వద్దనున్న ప్రభుత్వ వైన్‌ షాపు (07289) నుంచి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అక్రమంగా తరలిస్తున్న ఆరు బాక్సుల మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌, ఎస్‌ఇబి అధికారులు సీఐ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. స్థానిక ఎక్సైజ్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కరోనా సమయంలో పట్టణంలోని ఈ షాపు నుంచి మద్యం సీసాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లోని బ్రాండెడ్‌ మద్యం సీసాలను సూజర్‌వైజర్లు, సేల్స్‌మెన్లకు నగదు ఇచ్చి అక్రమంగా తరలించి విక్రయించారన్నారు. డిపో నుంచి స్టాక్‌ రాగానే బ్రాండెడ్‌ సీసాలు విక్రయించినట్లు లెక్కల్లో చూపించి ఆ సరుకును అధిక ధరలకు బయటకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. కొందరు స్టాక్‌ వచ్చినప్పుడు కంప్యూటర్‌ లో నమోదు చేసుకుని స్టాక్‌ షాపుల్లో దించుకోకుండా డైరక్ట్‌ గా బ్లాక్‌ మార్కెట్‌ కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మద్యం అక్రమ విక్రయాలకు పాల్పడిన సూపర్‌ వైజర్లు, సేల్స్‌మెన్స్‌ ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు వారు వివరించారు. శావల్యాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైన్‌ షాపులో మద్యం విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకులో జమ చేయకుండా ఆ షాపు లో పని చేస్తున్న సూపర్‌ వైజర్‌, సేల్స్‌మెన్స్‌ సొంతానికి వాడుకున్నారనే సమాచారంతో కేసు నమోదు చేసి వారి నుంచి నగదు రికవరీ చేసినట్లు చెప్పారు.