Jan 10,2021 22:34

మాట్లాడుతున్న వేమేశ్వరి

అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి - వినుకొండ : అంగన్వాడీలకు, హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి ఐ.వేమేశ్వరి డిమాండ్‌ చేశారు. ఆదివారం సిపిఎం కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తల్లీబిడ్డల సంక్షేమానికి 40 ఏళ్లుగా అంగన్వాడీలు సేవలందిస్తున్నారని, వారిని ప్రభుత్యోద్యో గులుగా గుర్తించాలని కోరారు. ఇళ్ల స్థలాలు, అమ్మబడి పథకాల్లో మంజూరైన లబ్ధిదారుల పేర్లు తొలగించడాన్ని ఆమె ఖండించారు. జిల్లాలో అర్హులైన హెల్పర్లకు వర్కర్లుగా ఉద్యోగోన్నతి ఇవ్వకుండా రాజకీయ నాయకులు వేధించడం దారుణమన్నారు. అఖిలభారత పిలుపులో భాగంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి ఈ నెల 27న పీడీ కార్యాలయాల ఎదుట నిర్వహించే ఆందోళనలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మెటిల్డా దేవి, సిఐటియు పట్టణ కార్యదర్శి గుంజరి యేసు, వెంకటప్పయ్య, రంజాన్‌బి, ఆంజనేయులు పాల్గొన్నారు.