- మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలి.
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : మణిపూర్ రాష్ట్ర ప్రజలపై మూడు నెలలుగా కొనసాగుతున్న మారణహోమాన్ని ఆపాలని, మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడులకు కారణమవుతున్న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నిరసనలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం 42 సంఘాలు సంస్థలతో ఐక్యంగా ఏర్పడిన కర్నూల్ పౌర సమాజం ఆధ్వర్యంలో కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుండి రాజ్ విహార్, మెడికల్ కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమానికి నిరసనగా వేలాది మందితో మహాప్రదర్శనను నిర్వహించారు. మహిళలను నగ్నంగా తిప్పి అత్యాచారాలు చేసి చంపిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, కుకీలు నివసించే కొండ ప్రాంతంలో ఉన్న పచ్చరాయి కోసం మతఘర్షనలు సృష్టించి ఆర్ధిక నేరగాళ్ళకు అప్పజెప్పాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి, మణిపూర్ రాష్ట్రం లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపలేని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలంటూ ప్రదర్శనలో పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం రెండు గంటల పాటు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యండి ఆనంద్ బాబు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల, జమాతే ఇస్లాం హింద్ కార్యదర్శి ఉమేరా భాను సాహెబ్, కరీమున్, ఆవాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, మహమ్మద్ షరీఫ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్, జాతీయ మాల మహానాడు కార్యదర్శి మునయ్య, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ అలివేలమ్మ, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు హరీష్ కుమార్ మాట్లాడుతూ దేశం మొత్తంగా మణిపూర్ మారణహోమంపై గగ్గోలు పెడుతుంటే, దేశ ప్రధాని మాత్రం పార్లమెంటులో మణిపూర్ సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించలేదన్నారు. పోలీస్ స్టేషన్లలో దూరి తుపాకులను కొల్లగొట్టి, ప్రార్థన ఆలయాలనే కాక గిరిజనుల ఇళ్లను ఇండ్లలో మనుషులు ఉండగానే నిప్పు పెట్టి కాల్చి చంపుతూ, మహిళలను నగ్నంగా నడివీధుల్లో ఊరేగించి, సామూహిక అత్యాచారాలు జరిపి చంపుతున్నా దేశ ప్రధానికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. మరణహోమాన్ని ఆపలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రాష్ట్రపతి భర్త రఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ, ఆర్ వి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇరిగినేని పుల్లారెడ్డి, వై నగేష్, సి గురు శేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, హిమాంలు హఫీజ్ అల్లాబకాస్, హఫీస్ చాంద్ భాషా, పాస్టర్లు గుర్రం రవి, ఎస్ రవికుమార్, జోసఫ్, హిందీ పండిట్ కళాశాల ప్రిన్సిపల్ నిస్సార్ అహ్మద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దిలేటి మాట్లాడుతూ ఆచార సాంప్రదాయాల పేరుతో మత ఉన్మాదాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వాలన్నీ అనాగరిక కాలానికి తిరిగి తీసుకువెళ్తున్నాయన్నారు. మణిపూర్ రాష్ట్రంలోని గిరిజనులైన కుకీలు నాగాలు నివసించే కొండ ప్రాంతాల్లో లభిస్తున్న ఖనిజ సంపదపై కన్నుబడ్డ ముష్కర మూకలు, మెజారిటీ మతస్తులైన మైతి తెగలలో అభద్రతా భావాన్ని పెంచి ఉదృతమైన అఘాయిత్యాలకు పాల్పడేలా తోడ్పడుతున్నారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అన్నారు. ధర్నా కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు అవేజ్ అహ్మద్, తాండ్రపాడు సర్పంచ్ బాలపీర, జమాతే ఇస్లాం హింద్ నాయకులు బషీర్, ఫరూక్, ఆవాజ్ నాయకులు చోటు, ఫయాజుల్ కరీం, అబ్దుల్ నవాజ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, హుస్సేన్ భాష, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్, సాయి, కెవిపియస్ దళిత మహిళా విభాగం, కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం, స్కావెంజర్స్ కార్మిక హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శులు డి విజయమ్మ, ఎన్ జి కృష్ణ, ఆండ్ర గురుస్వామి, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ సుజాత, వేణి, విజయ కుమారి, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా, విజయ్, రామకృష్ణ తో పాటు మరో 2000 మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.










