Sep 27,2020 07:43

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌) రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. పెన్షన్‌ పరిణామ క్రమం అర్థమైతే వారి డిమాండ్‌లో వున్న వాస్తవికత బోధపడుతుంది.
అమెరికాలో 1929లో ప్రారంభమైన మహా మాంద్యం పదేళ్ళపాటు ప్రపంచాన్ని వణికించింది. వేలాది పరిశ్రమలు, బ్యాంకులు మూతబడ్డాయి. ఉపాధి కోల్పోయి, నిరుద్యోగం పెరిగి కోట్ల మంది రోడ్డున పడ్డారు. పాలకుల పెట్టుబడిదారీ సంక్షోభపు దుష్ఫలితాలను కార్మికులు, పేదల పైకి నెట్టారు. ఎటువంటి సామాజిక భద్రతా లేక జీవన ప్రమాణాలు దిగజారి ఆకలి, ఆత్మహత్యలకు గురయ్యారు. చివరకు ప్రజలు, కార్మికుల పైన క్రూరమైన దోపిడీ చేసి రెండవ ప్రపంచ యూద్ధానికి దిగబడి ఆరు కోట్ల మందిని బలి ఇచ్చి సంక్షోభం నుండి బయటపడిన దుర్మార్గమైన వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానం ప్రజల ముందు నిలిచింది.
ప్రపంచమంతా ఇలా ఉంటే సంక్షోభపు ఛాయలు కూడా తాకని ఏకైక దేశంగా రష్యా నిలిచింది. అదేకాలంలో సోవియట్‌ రష్యాలో సోషలిజం సాధించిన విజయాలు నివ్వెరపరిచాయి. స్టాలిన్‌ ప్రారంభించిన మొదటి పంచవర్ష ప్రణాళిక నాలుగేళ్ళపాటు తన లక్ష్యాలను పూర్తిచేసి కేక పుట్టించింది. మౌలిక వసతులు, పరిశ్రములు, ఉపాధి, వేతనాలు పెరిగాయి. వనరుల పంపిణీ మార్కెట్‌ అవసరాలనుబట్టి కాక మనిషి ప్రామాణికంగా క్రమబద్ధం చేసింది. పని గంటలు, వేతనాలు, పెన్షన్లు, వంటివి దయాదాక్షిణ్యాలుగా కాక హక్కులుగా మార్చింది. శ్రమకు పట్టంకట్టి గౌరవప్రదమైన జీవితానికి గ్యారంటీనిచ్చే అనేక చట్టాలను చేసింది. ఏకకాలంలో రెండు వ్యవస్థలను ప్రపంచమంతా చూసింది.
సోవియట్‌లో సోషలిజం ప్రపంచ దేశాలపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. కమ్యూనిస్ట్‌ పార్టీలు బలపడ్డాయి. కార్మిక సంఘాలు ఏర్పడి సమ్మెలు కట్టాయి. ప్రజలు కమ్యునిజం వైపు చూడకుండా ఉండడానికి పెట్టుబడిదారీ పాలకులు సంక్షేమ విధానాలను అమలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల వంటి కొన్ని గ్యారంటీలు అమలయ్యాయి.
మన దేశంలో కూడా సోవియట్‌ ప్రభావంతోనే నుభాష్‌ చంద్రబోస్‌ ప్రణాళికా రచన, నెహ్రూ ప్రభుత్వ రంగ అనుకూల విధానాలు, ఉపాధి కల్పన, పేదలు కార్మికులకు సంక్షేమ పథకాలు, లేబర్‌ బోర్డుల ఏర్పాటు, వృద్ధులు, వితంతువులు, ఉద్యోగులకు పెన్షన్లు, కనీస వేతనాలు, పని గంటల తగ్గింపు వంటి చర్యలు పాలక వర్గాలు చేపట్టాయి. బ్రిటీష్‌ వారి కాలం నుండి మన దేశంలో పెన్షన్‌ అమల వుతోంది. అయినప్పటికీ ఈ అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వాతావరణ అనంతరం...'ఉద్యోగికి పెన్షన్‌ హక్కు ఇవ్వడం ప్రభుత్వం సామాజిక బాధ్యత' అనే సోషలిస్ట్‌ భావజాలం నుండి రూపొందినదే పాత పెన్షన్‌. 1990 తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోవియట్‌ను ఒంటరి చేయడం, కార్మిక పోరాటా లను అణచివేయడం, ఆయా దేశాలలో నియంత లను ప్రోత్సహించడం, కమ్యూనిజం ప్రభావం పడ కుండా నిధులు ఖర్చు చేయడం వంటి చర్యలతో అమెరికా సోషలిజాన్ని దెబ్బ తీయగలిగింది. ఫలితంగా పేదలకు, కార్మికులకు, ఉద్యోగులకు అండగా ఉన్న ఒక శక్తి అదృశ్యమైపోయింది.
ఈ రాజకీయ సానుకూలతను ఆసరా చేసుకొని, తమ సంక్షోభాన్ని అధిగమించడానికి ముందు అమెరికా, తరువాత మన పాలక వర్గాలు నయా ఉదారవాద మార్గాన్ని పట్టాయి. సోవియట్‌లో సోషలిజం కూలిపోవడంతో పెట్టుబడిదారీ వర్గానికి ఎదురు లేకుండా పోయింది. పెట్టుబడిదారీ విధానమే అంతిమమని, దీనికి ప్రత్యమ్నాయం లేదని ప్రవచనాలు వల్లించారు. కానీ కొద్దికాలంలోనే మరలా 2000 లోను 2008 నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయి నేటికీ కొనసాగుతోంది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా సంక్షేమ పథకాలను ఎత్తివేశారు. రిటైర్మెంట్‌ వయసు పెంచి పింఛను సదుపాయాలు తగ్గించారు. నియామకాల్లో ఎటువంటి భద్రతా లేని ఫైర్‌ విధానం తెచ్చారు. అనేక దేశాల్లో భద్రతగా ఉన్న ఉద్యోగ పింఛన్‌ పథకాల్లో సంస్కరణలు తీసుకొచ్చి పింఛన్‌ను కూడా మార్కెట్‌కే వదిలి వేదిలేశారు. 2008 అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగ పింఛన్‌ నిధులు గల్లంతయ్యాయి. సోషలిజం ప్రభావంతో ఉద్యోగులు సాధించుకున్న హక్కులు, భద్రతలపై దాడి జరిగింది.
మన దేశంలో నయా ఉదారవాద విధానాలలో భాగంగా పింఛన్‌ సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రపంచ దేశాల పింఛన్లను అధ్యయనం చేసిన ప్రపంచ బ్యాంకు పాత పింఛన్‌ ప్రభుత్వాలు భరించేవిగా లేవని, కంట్రిబ్యూటరీ సిస్టమ్‌ను మన దేశంలో ప్రవేశ పెట్టాలని మన పాలకులకు సూచించింది. అందులో బాగంగా 2004 జనవరి ఒకటవ తేదీ నుంచి సి.పి.ఎస్‌ అమల్లోకి వచ్చింది. అంటే పాత పింఛన్‌ సోషలిస్ట్‌ భావాజాలంతో రూపొందినదైతే...రెండోది ఉదారవాద విధానాల ఫలం. ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితానికి సామాజిక భద్రత బాధ్యత సమాజానిది, రాజ్యానిది అని పాత పింఛన్‌ చెబితే, కొత్త పింఛన్‌ ఆ భాద్యత ఉద్యోగులది, మార్కెట్‌ది అని చెబుతుంది. ఉద్యోగుల పాత పింఛన్‌ నిధులు ప్రభుత్వ పెట్టుబడులుగా సమాజానికి ఉపయోగపడితే, కొత్త పింఛన్‌ నిధులు ప్రభుత్వ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచడానికి ఉపయోగపడతాయి. పాత పింఛన్‌లో నిర్వచిత లాభం గ్యారెంటీగా వస్తుంది. కొత్త పింఛన్‌లో షేర్‌ మార్కెట్‌ మాయాజాల దయతో వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఎలాంటి గ్యారెంటీ లేదు.
పార్లమెంట్‌లో ఎటువంటి చట్టమూ చేయకుండా కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతోనే సిపిఎస్‌ ను 2004 నుంచి 2013 వరకు సుమారు పదేళ్లపాటు అమలైపోయింది. సుప్రీంకోర్టు 1982 లో డిఎస్‌ సఖారా కేసులో పింఛను ఉద్యోగి హక్కు అని చెప్పిన తీర్పును కూడా కేంద్రం పట్టించుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం నియమించిన బి.కె.భట్టాచార్య కమిటీ కూడా పాత పింఛన్‌ స్కీమ్‌ను కొనసాగిస్తూనే కొత్త పింఛన్‌ స్కీమ్‌ను అంటే రెండంచెల విధానాన్ని సిఫార్స్‌ చేసింది. దీనిని కూడా లెక్కచేయలేదు. ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాలే చివరికి అమలయ్యాయి. అంటే ఇది ఎంత పెద్ద మార్కెట్‌గా అవతరించిందో అర్ధం చేసుకోవచ్చు.
2001లో బి.కె.భట్టాచార్య కమిటీని నియమించి కొత్త పింఛన్‌కు బిజెపి శ్రీకారం చుట్టగా 2004లో కాంగ్రెస్‌ అమలుకు పూనుకున్నది. 2013లో పార్లమెంట్‌లో చట్టం చేసింది. బిజెపి, కాంగ్రెస్‌ పాలించిన రాష్ట్రాలలోనూ అమలు చేశాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం పాత పెన్షన్‌ను అమలు చేస్తే కాంగ్రెస్‌ అధికారం లోకి రాగానే కొత్త పెన్షన్‌ను అమలు చేసింది. దేశమంతా సిపిఎస్‌ రద్దుకై పెద్ద ఉద్యమాలు నడుస్తున్నా...త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన పాత పింఛన్‌ను బిజెపి రద్దు చేసింది. ఇటీవల పార్లమెంట్‌లోనూ సిపిఎస్‌ రద్దు చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటించింది. తృణముల్‌, డిఎంకె మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలలో సిపిఎస్‌ ను అమలు చేస్తున్నాయి.
పెన్షన్‌ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రారంభం నుండీ అఖిల భారత సమ్మెలు నిర్వహించడమేగాక 2005లో పార్లమెంటులో చట్టం చేయకుండా అడ్డుకు న్నాయి. 2013లో పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొత్త పింఛన్‌ను అమలు చేయలేదు. ఈ కొత్త పింఛన్‌కు మూలమైన విధానాలపై నిరంతరం పోరాడుతున్నాయి.
తొలుత సిపిఎస్‌ చాలా లాభమదాయక మైనదని ఉద్యోగులు, ఉపాధ్యాయులను నమ్మించ డంలో పాలకులు విజయవంతమయ్యారు. అందుకే వామపక్షాల పోరాటాల్లో భాగం కాలేకపో యారు. నష్టం అర్ధమయ్యాక పెద్ద ఎత్తున పోరా టాలకు కదిలారు. రాజకీయ పార్టీలు సిపిఎస్‌కు మూలమైన ఆర్థిక విధానాలను ఒకవైపు బలపరు స్తూనే ... మరోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసం మానిఫెస్టోలలో రద్దు అంశాన్ని పెడుతున్నాయి. అధికా రానికి వస్తున్నారేగానీ రద్దు మాత్రం చేయ డంలేదు. మన రాష్ట్రంలో అధికారానికి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ ను రద్దు చేస్తామన్న వైసిపి...ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.
ఏదేమైనా సిపిఎస్‌ రద్దుకు సంబంధించి ఉద్యోగులు, వారి సంఘాల ముందున్న దారి ఏది? సిపిఎస్‌కు మూలమైన రాజకీయ ఆర్థిక విధానాలను మద్దతిచ్చే రాజకీయాలను బలపర్చ డమా? వ్యతిరేకించి పోరాడే రాజకీయాలను బలపర్చడమా? సిపిఎస్‌ రద్దు కావాలంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వామపక్షాలతో కలిసి నడవడం మినహా మరో మార్గముందా?
(వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి)