Jan 08,2021 21:45

వాషింగ్టన్ : కాపిటల్‌ భవనంపై హింసాత్మకమైన తిరుగుబాటుకు కారణమయ్యారంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను యూనియన్‌ నేతలు తీవ్రంగా విమర్శించారు. ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఎన్‌ఎఎసిపి (నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్‌) సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. కొద్ది గంటల్లోనే మరో అభిశంసన అనుకూల పిటిషన్‌ వచ్చింది. మూవ్‌ ఆన్‌ వెబ్‌సైట్‌లో ఈ పిటిషన్‌పై లక్షా 57వేల మందికి పైగా సంతకాలు చేశారు. అభిశంసనకు ఆయన అర్హుడని కాంగ్రెస్‌కు కొత్తగా ఎన్నికైన తొలి బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ కార్యకర్త కోరి బుష్‌ వ్యాఖ్యానించారు. నేషనల్‌ పబ్లిక్‌ రేడియోలో ఆయన మాట్లాడుతూ, ''తాను కూడా ఆందోళనలు, నిరసనల నుండే వచ్చానని, కాని కేపిటల్‌ భవనంపై జరిగింది నిరసన కాదని, తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిన ట్రంప్‌ను తక్షణమే తొలగించాలని పెన్స్‌ మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఒలివా ట్రోరుడిమాండ్‌ చేశారు. కేపిటల్‌ భవనం వద్ద జరిగిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్న మీడియా సభ్యులపై కూడా తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌, రాయిటర్స్‌, ఇతర పత్రికలకు చెందిన సభ్యులను వారు బెదిరించారు. కెమెరాలను పగలగొట్టారు. ట్రంప్‌ ఆదేశాల ఫలితమే ఈ కుట్ర అని వారు విమర్శించారు.
యాంటిఫాపైకి నెట్టేసే యత్నం
 కేపిటల్‌ భవనంపై దాడికి సమాధానం చెప్పుకోలేని ట్రంప్‌ మద్దతుదారులు దీనిని యాంటిఫా (ఫాసిస్టు వ్యతిరేక గ్రూపు) మీదికి నెట్టేసే యత్నం చేస్తున్నారు. ఫాసిస్ట్‌ వ్యతిరేక గ్రూపు యాంటిఫాకి చెందినవారే ఈ ఆందోళనకారులై వుంటారని సోనీ అనే ట్రంప్‌ మద్దతుదారు వ్యాఖ్యానించారు. తానొక్కిడినే కాదని, ఇతర మద్దతుదారులు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. వాషింగ్టన్‌ డిసి మాజీ పోలీసు అధికారి జోర్డాన్‌ కొల్విన్‌ ఈ వ్యాఖ్యలను ఖండించారు. అరాచక గ్రూపులపై ఎల్లప్పుడూ నిఘా వేసి వుంచుతారని, ఇటువంటి ప్రతి గ్రూపు నుండి వచ్చే ముప్పును ముందుగానే అంచనా వేసి అందుకు సిద్ధమవుతారని, ఫెడరల్‌ సంస్థలన్నీ కలిసి ఈ విషయంలో పక్కాగా పనిచేస్తాయని చెప్పారు.