Apr 05,2023 11:22
  • శృంగార తారతో సెక్స్‌
  • బయటకురాకుండా డబ్బు ముట్టజెప్పిన కేసులో కోర్టులో లొంగుబాటు

న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ సంబంధం మాఫీకి డబ్బు ముట్టజెప్పిన కేసులో మంగళవారం మన్‌హాటన్‌ కోర్టు ఎదుట లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజపరిచారు. ఆయనపై అభియోగాలను కోర్టులో చదవి వినిపించారు. లొంగిపోవడానికి ముందు ట్రంప్‌ తన మద్దతుదారులకు పంపిన ఇ-మెయిల్‌లో అమెరికా మార్క్సిస్ట్‌ తృతీయ ప్రపంచ దేశంగా మారిపోతోందని రుసరుసలాడారు. శృంగార తారతో అక్రమ లైంగిక సంబంధాన్ని బయటకు రానీయకుండా డబ్బులు చెల్లించిన కేసులో ఆయనపై మన్‌హటన్‌ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
        అమెరికా న్యాయవ్యవస్థ స్వచ్చత, పారదర్శకత గురించి సోషల్‌ మీడియా ప్రశ్నిస్తోందని ట్రంప్‌ తన ఇ-మెయిల్‌ సందేశంలో ఆరోపించారు. 2016లో నీలి చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులకు సంబంధించి ట్రంప్‌పై కోర్టు నేరాభియోగాన్ని నమోదు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒకరు క్రిమినల్‌ కేసులో కోర్టులో లొంగిపోవడం ఇదే మొదటిసారి. ఈ అక్రమ సంబంధం వ్యవహారం గురించి 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు బయటకు రాకుండా చేసేందుకు డేనియల్స్‌కు లక్షా 30వేల డాలర్ల మేరకు డబ్బును చెల్లించారంటూ గత గురువారమే ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీ ట్రంప్‌ను అభిశంసించింది. ''అమెరికాలో న్యాయాన్ని కోల్పోయినందుకు మేం సంతాపం పాటిస్తున్నాం. ఎలాంటి నేరం చేయనందుకు ప్రధాన ప్రత్యర్ధిని పాలక రాజకీయ పార్టీ అరెస్టు చేయిస్తున్న రోజు'' అని ట్రంప్‌ తన మెయిల్‌లో రాశారు. ''అసమ్మతిని నేరంగా భావించి, రాజకీయ వ్యతిరేకులను జైల్లో పెట్టించే 'మార్క్కిస్ట్‌ తృతీయ ప్రపంచ దేశం'గా అమెరికా మారిపోతోందంటూ ఆయన అవాకులు చవాకులు పేలారు. తాను చేసింది తప్పా ఒప్పా అనేది చెప్పకుండా అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రాన్ని పొందిన దేశమని, రెండు ప్రపంచయుద్ధాలను గెలిచిందని, చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుడు అమెరికనేనంటూ జాతి దురభిమానాన్ని రెచ్చగొట్టే యత్నం చేశారు.
 

                                                                   'వెంటనే విచారణ జరిగేనా ?

ఫ్లోరిడాలోని తన నివాసం నుండి సోమవారం న్యూయార్క్‌కు బయలుదేరిన ట్రంప్‌ రాత్రి ట్రంప్‌ టవర్‌లో గడిపారు. ట్రంప్‌ లొంగుబాటు సందర్భంగా రాజకీయంగా కోర్టు వద్ద భయాందోళనలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.