వాషింగ్టన్ డిసి : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో జార్జియా రాష్ట్ర ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో ట్రంప్‌పై నమోదైన నాలుగో క్రిమినల్ కేసు ఇది. రాబోయే అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన రిపబ్లికన్ నేత ట్రంప్‌తో పాటు మరో 18 మందిపై తాజా కేసులో నేరాభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు, అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు నమోదైన 13 అభియోగాలను ట్రంప్ ఖండించారు. రాజకీయ కక్షతో ఆ ఆరోపణలు చేసినట్లు ఆయన తెలిపారు. జార్జియా ప్రాసిక్యూటర్ ఫాని విల్లిస్ తన తీర్పును వెలువరించారు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్న అంశంపై 2021 ఫిబ్రవరిలో ఆమె దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై 98 పేజీల రిపోర్టును ఆమె తయారు చేశారు. సోమవారం ఆ తీర్పును ప్రకటించారు. ఆగస్టు 25వ తేదీలోగా సరెండర్ కావాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. జార్జియా ఎన్నికల అధికారితో ట్రంప్ మాట్లాడినట్లు ఓ ఫోన్ కాల్ రికార్డు లీకైంది. తనకు మరో 11,780 ఓట్లు కావాలని, ఆ ఓట్లు దక్కేలా ఎలాగైనా చూడాలని జార్జియా అధికారిని ట్రంప్ కోరినట్లు ఆ రికార్డులో సంభాషణ ఉన్నది. ఆ ఫోన్ రికార్డు కారణంగానే జార్జియా కేసులో ప్రాసిక్యూటర్ విచారణ చేపట్టారు. కీలకమైన ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ గెలుస్తుందని ఆశించినా.. చివరకు డెమొక్రటిక్ పార్టీ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది.