Apr 04,2023 15:11

వాషింగ్టన్‌   :  క్రిమినల్‌ అభియోగాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌  మంగళవారం కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు . ట్రంప్‌ మన్‌హట్టన్‌ కోర్టులో న్యాయమూర్తి జువాన్‌ మోర్చాన్‌ ఎదుట హాజరుకానున్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్‌ స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ట్రంప్‌పై క్రిమనల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని తన మార్‌ ఏ లాగో నివాసం నుండి సోమవారం ట్రంప్‌ న్యూయార్క్‌ చేరుకున్నారు. విమానాశ్రయం నుండి తన మద్దతుదారులతో మన్‌హట్టన్‌లో ఉన్న ట్రంప్‌ టవర్‌లోని 5వ అవెన్యూకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం  మంగళవారం రాత్రి  ఆయన   తిరిగి ఫ్లోరిడా చేరుకోనున్నట్లు ట్రంప్‌ న్యాయవాది పేర్కొన్నారు.
ట్రంప్‌పై చేసిన అభియోగాలను గ్రాండ్‌ జ్యూరీ సీల్డు కవరులో ఉంచింది. ఆందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు స్థానిక మీడియా ఓ కథనంలో పేర్కొంది. వాటిని కోర్టులో 10-15 నిమిషాల పాటు వినిపించనున్నారు. అయితే కోర్టులో ట్రంప్‌ను రహస్యంగా విచారించనున్నట్లు న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి జుయాన్‌ మెర్చన్‌ వెల్లడించారు. మీడియాను కోర్టు లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతినివ్వాలంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది.