రాష్ట్రాల పరిధిలోని మధ్య చిన్న తరహా ఓడ రేవులను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రతిపాదించిన 'పోర్ట్స్ బిల్-2020' నిస్సందేహంగా పోర్టుల ప్రైవేటీకరణను మరింత సులభతరం చేస్తుంది. అస్మదీయ కార్పొరేట్లకు వనరులను, లాభసాటి వ్యాపారాన్ని కట్టబెడుతుంది. బిజెపి సర్కారు కార్పొరేట్ల ప్రాపకం కోసం వ్యవసాయ చట్టాలను దేశంపై బలవంతంగా రుద్దగా, పోర్టుల బిల్లు దాని కొనసాగింపు. కొత్త చట్టం కనుక వస్తే దేశ స్థాయిలో మారటైం పోర్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ అధీనంలోకి దేశంలోని సమస్త పోర్టులూ వచ్చేస్తాయి. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్సు యాక్ట్ (1908) రద్దవుతుంది. ఫలితంగా మీడియం, మైనర్ పోర్టులపై అధికారాలను, ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. వ్యవసాయ చట్టాలకు మల్లేనే పోర్టుల బిల్లును సైతం తాననుకున్న విధంగా తయారుచేసి రాష్ట్రాలకు పంపుతూ, ఏదో లాంఛనంగా సమాచారం కోరడం మోడీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి తార్కాణం. రాష్ట్రాల హక్కులను హరించే బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. రాజ్యాంగ వ్యతిరేకం.
దేశానికి మూడు వైపులా నాలుగు వేల కిలోమీటర్ల సముద్ర తీరం, రెండొందల వరకు పోర్టులు ఉన్నాయి. ఏడాదికి 11 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పోర్టుల వల్ల లభిస్తోంది. నయా-ఉదారవాద విధానాలొచ్చాక మౌలిక వసతుల రంగంలో ప్రైవేటీకరణ మొదలైంది. కార్పొరేట్లు లాభసాటి వనరులను చౌకగా కొట్టేయడం ఆరంభమైంది. ఆ పరంపరలో తాజాగా పోర్టుల వంతు వచ్చింది. దేశంలో ప్రైవేటు పోర్టుల రంగంలో అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ అతి పెద్దది. పోర్టుల ద్వారా జరుగుతున్న కార్గో వ్యాపారంలో 25 శాతం ఆ కంపెనీదే. గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవు దేశంలోకెల్ల అతి పెద్ద ప్రైవేటు ఓడరేవు. అది అదానీ చేతుల్లోనే ఉంది. ఈ దృష్టాంతాలన్నీ తెలియజేసేదేమంటే, మోడీ ప్రభుత్వం తెస్తున్న నూతన పోర్టుల బిల్లు అదానీ, అంబానీ, అండ్‌కో కోసమేనని. వారి లాభాల దోపిడీకి అడ్డొస్తున్న రాష్ట్రాల అధికారాలను బలవంతంగా లాక్కోడానికి, ఫెడరల్ వ్యవస్థను చిదిమేయడానికి, చివరికి రాజ్యాంగాన్ని తెగనాడటానికి బిజెపి సర్కారు వెనకాడట్లేదు.
దాదాపు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కేంద్ర బిల్లు ఆశనిపాతం వంటిది. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పోర్టులు ఇరుసుగా మారతాయని ప్రజలు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద ప్రభుత్వరంగంలో భారీ ఓడరేవు నిర్మాణాన్ని విభజన చట్టంలో పొందుపర్చగా, విభజన హామీలన్నింటినీ తూచ తప్పకుండా అమలు చేస్తామన్న బిజెపి, ఆరున్నరేళ్లు దాటినా దుగరాజపట్నం గురించి పల్లెత్తు మాట్లాడట్లేదు. ఇప్పుడు బిల్లు రూపంలో రాష్ట్ర పరిధిలోని చిన్న పోర్టులను ఎగనెత్తుకుపోయేందుకు కుట్రలు పన్నుతోంది. ఎ.పి లో 14 చిన్న పోర్టులుండగా వాటి అభివృద్ధి కుంటుతోంది. మచిలీపట్నం పోర్టు వివాదాలను దాటట్లేదు. కృష్ణపట్నంలో మెజారిటీ వాటాలను అదానీ సంస్థ చేజిక్కించుకుంది. విశాఖ పోర్టులో బెర్త్‌ను కాంట్రాక్టు తీసుకొని దానిని నిస్తేజంగా ఉంచి దెబ్బతీస్తోంది. తీర ప్రాంతంలో ఓడ రేవుల అభివృద్ధి కన్నా తన అధీనంలోని ఓడ రేవుల ద్వారా మాత్రమే రవాణా జరిగేలా నియంత్రించడం అదానీ సంస్థల అసలు లక్ష్యం. దానిని నెరవేర్చడానికే ఈ కొత్త చట్టాన్ని మోడీ ప్రభుత్వం తెచ్చింది. పోర్టులు, సెజ్‌ల మాటున భారీ భూసేకరణ స్కాం వాన్‌పిక్ నుంచి బందరు వరకు ఉండనే ఉంది. కాగా పోర్టు బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడం స్వాగతించదగింది. అయితే ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామన్న వైసిపి, అనతికాలంలో 'అడుగుతూనే ఉంటాం' అనే స్థాయికి దిగజారింది. జిఎస్‌టి బకాయిల విషయంలో మెత్తగా ఉంది. దేశం యావత్తూ రైతులు వ్యవసాయ చట్టాలపై ఆందోళన చెందుతుండగా ఎ.పి గమ్మునుంది. లేఖలు రాయడంతో సరిపెట్టకుండా పోర్టుల బిల్లును కేంద్రం ఉపసంహరించేలా వైసిపి ఒత్తిడి చేయాలి. తతిమ్మా రాష్ట్రాలతో సంప్రదించి, కలిసి ముందుకెళ్లాలి. కేంద్రం మెడలు వంచాలి.










