Oct 12,2022 20:56

ప్రజాశక్తి -అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా :అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో రూ.350 కోట్లతో నిర్మించిన ఇమెరీస్‌ పరిశ్రమను బుధవారం ఫ్రెంచ్‌ భారత రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సాంకేతికత ఉత్పాదక ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి ఈ పరిశ్రమ పనిచేస్తుందని తెలిపారు. సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫిలిప్‌ బోర్గ్‌ మాట్లాడుతూ ఉక్కు, సిమెంటు తయారీలో భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ పరిశ్రమలో ఉక్కు, సిమెంటు పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులు 30 వేల టన్నుల ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2030 సంవత్సరం నాటికి 50 వేల టన్నులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. కాల్షియం అల్యూమినిట్‌ బైండర్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు అదనంగా రూ.12 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలో 200 మంది ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పని చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇమెరీస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెగి ఇడికుల, తదితరులు పాల్గొన్నారు.