కేంద్రం మోసాన్ని సీమ సహించదు : మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : కడపలో ఉక్కు పరిశ్రమ వీలు కాదని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ఏకపక్ష ప్రకటన దుర్మార్గమైందని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం పదేపదే తూట్లూ పొడుస్తోందన్నారు. చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం రాయలసీమ ప్రజల పట్ల కేంద్రం చేస్తోన్న నేరం అన్నారు.
తెలుగు ప్రజలకు ఉమ్మడిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోవడం కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలకు అద్దం పడుతోందన్నారు. కడపలో ఉక్కు.. పరిశ్రమ రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. రాయలసీమ భవిష్యత్ పారిశ్రామికీకరణకు అదొక అవసరమని పేర్కొన్నారు. దాన్ని కాదనే వారు ఎవరికైనా రాయలసీమ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సాంకేతిక అంశాల మాటున, రాయలసీమకు మోసం చేయాలని చూస్తే బిజెపికి ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. విభజన చట్టంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిర్ధేశించిన బాధ్యతలను, ఎటువంటి మినహాయింపులూ లేకుండా నిర్వర్తించాలని డిమాండ్ చేశారు.










