-అడ్డుబోయిన సిపిఎం నాయకులపై సిఐ దౌర్జన్యం, అనుచిత ప్రవర్తన
-లాఠీఛార్జి, అరెస్టు, దళితులను కులం పేరుతో దూషణ
ప్రజాశక్తి- గార్లదిన్నె, అనంతపురం కలెక్టరేట్, అమరావతి బ్యూరో:అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పేదల ఇళ్లు, గుడిసెలను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం వేకువజామున జెసిబిలో తొలగించేశారు. దీనిని అడ్డుకోబోయిన సిపిఎం నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సిఐ అనుచితంగా ప్రవర్తించారు. నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 165లోగల ప్రభుత్వ భూమిలో నాలుగేళ్ల క్రితం 150 దళిత, గిరిజన కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని, గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. అక్కడే తమకు నివాస స్థల పట్టాలు ఇవ్వాలని వారు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరాయి. అయినా, ప్రయోజనం లేకపోయింది. పైగా, ఆ భూమి దేవాదాయ శాఖకు చెందినదంటూ, దానిని ఖాళీ చేయాలంటూ అధికారులు పలుమార్లు బెదిరింపులకు దిగారు. దీంతో, పేదలు న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా నాలుగు జెసిబిలతో గుడిసెల కూల్చివేతకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు బుధవారం వేకువజామున వచ్చారు. రూరల్ డిఎస్‌పి ఆధ్వర్యాన ఐదుగురు సిఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారు. ఏమి జరుగుతుందో తెలియక నిద్రలో ఉన్న పేదలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆందోళనకు గురయ్యారు. గుడిసెల్లో నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి ఉన్నాయని, తొలగించొద్దని ప్రాథేయపడినా కనికరం లేకుండా వ్యవహరించారు. గుడెసెలను దౌర్జన్యంగా జెసిబిలతో కూల్చివేయించారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లి అడ్డుకోబోయిన సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, గార్లదిన్నె మండల కార్యదర్శి చెన్నారెడ్డి, రైతు సంఘం నాయకులు నాగరాజు పట్ల ఇటుకలపల్లి సిఐ వై.నరేంద్రరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. రాంభూపాల్‌ను కొట్టారు. షర్ట్ కాలర్ పట్టి లాగుతూ 'ముందు ఈ నా కొడుకును లోపలెయ్యండి' అంటూ దూర్భాషలాడుతూ లాక్కెళ్లారు. సిపిఎం నాయకులపై లాఠీఛార్జి సైతం చేశారు. ఈ దౌర్జాన్యాన్ని మహిళలు అడ్డుకోగా వారిలో లక్ష్మీదేవి అనే మహిళను సిఐ జుట్టు పట్టి లాగేశారు. పేదలను నానా దుర్భాషలాడుతూ 'మాదిగ నా కొడుకులు ఎక్కడ స్థలం ఉంటే అక్కడేసుకుంటారు' అంటూ కులం పేరుతో దూషించారు. అడ్డుకున్న ప్రజలను కూడా కొట్టారు. ఈ దౌర్జన్యాన్ని ప్రశ్నించిన వారిపైనా సిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్ విప్పుతూ 'రండిరా చూసుకుందాం నా కొడుకల్లారా' అంటూ అసభ్యంగా ప్రవర్తించారు.
- పేదల కన్నీటి రోదన
కష్టపడి నిర్మించుకున్న గుడిసెలను కళ్లేదుటే కూల్చివేయడాన్ని చూసి పేదలు గుండెలు అవిసేలా రోదించారు. నిత్యావసర వస్తువులు, సామగ్రి ధ్వంసం కావడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అప్పడే పుట్టిన పసికందును సైతం చేతుల్లో ఎత్తుకుని బాలింత రోడ్డుపైకి రావాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
- తహశీల్దార్, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నా
పేదల ఇళ్లు, గుడిసెల తొలగింపు, నాయకులపై సిఐ అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గార్లదిన్నె తహశీల్దార్ కార్యాలయం, అనంతపురం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆర్‌డిఒను కార్యాలయం లోపలికి వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. దీంతో, సిపిఎం నాయకులతో ఆర్‌డిఒ చర్చలు జరిపారు. పేదలకు యథాస్థానంలో పట్టాలు ఇవ్వాలని, సిఐ నరేందర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం చేస్తామని ఆర్‌డిఒ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.
- ఎమ్మెల్యే హస్తం : ఎంఎ.గఫూర్
పేదల గుడిసెలు, ఇళ్లు తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతి హస్తం ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎం.గఫూర్ అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చి వేసిన ఇళ్లను బుధవారం సాయంత్రం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.ఓబులు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో గఫూర్ మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ప్రత్యామ్నాయ స్థలం చూపేంత వరకు నివాసాలను తొలగించరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయినా అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి దేవాదాయ శాఖ భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఉంటే ప్రస్తుతం పేదల ఇళ్లు కూల్చివేసిన స్థలానికి ఆనుకుని వైసిపి నాయకుడు ఆక్రమించుకున్న 90 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
- సిఐపై చర్యలు తీసుకోవాలి
- - పేదలకు న్యాయం చేయాలి
- డిజిపికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ
పేదల గుడిసెలను అక్రమంగా కూలగొట్టడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌పై చేయిచేసుకుని అసభ్యంగా దూషించిన ఇటుకలపల్లి సిఐ వై.నరేంద్రరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిసిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ భూమి నుంచి పేదలను ఖాళీ చేయించకుండా హైకోర్టులో డబ్ల్యుపి రిట్ పిటిషన్ నెంబర్ 39328/2022 రిజిస్ట్రేషన్ నెంబర్ 29532/ 2022 దాఖలైందని తెలిపారు. ఆ స్థలాల్లో పేదలను తొలగించరాదని కోర్టు కూడా స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. అయినా, గుడిసెలను కూల్చివేయడం, సిపిఎం నాయకులను అసభ్యకరంగా దూషించడం, దౌర్జన్యానికి పాల్పడడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన సిఐపై చర్య తీసుకోవాలని, అరెస్టు చేసిన రాంభూపాల్‌ను, ఇతర నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని, కూలగొట్టిన గుడిసెలను పునరుద్ధరించాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.
- పోలీసులపై చర్యలు తీసుకోవాలి : కెవిపిఎస్
ప్రభుత్వ స్థలంలోని పేదల గుడిసెలను కూల్చివేయడం, కులం పేరుతో దూషించడంపై సమగ్ర విచారణ జరిపించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఎం ధర్నా ...