ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పెంచిన ధరలను తగ్గించాలని, ఉద్యోగాలు కావాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమరభేరి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో ... ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు, కూలీలందరూ పాల్గని జయప్రదం చేయాలని మంగళవారం పుట్లూరు మండలంలోని కడవకల్ గ్రామంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ ... కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. గద్దెనెక్కింది మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పోరేట్లకు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసి ఆదాయాలను రాబట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పుకి అనుమతి ఇచ్చేది లేదని బెదిరిస్తున్నదని... ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలనే అత్యుత్సాహంతో అమలు చేస్తుందని ఆరోపించారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారనీ, ఈ భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని సిపిఎం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గని జయప్రదం చేయాలని సిపిఎం మండల కమిటీగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.సూరి, రైతు సంఘం మండల నేతలు పాల్గొన్నారు.