Feb 09,2023 21:37

ఆయిల్‌ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యాన ధర్నా
ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం కలిసి రూ.50 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అంగీకారం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, అమరావతి బ్యూరో
కాకినాడ జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఆయిల్‌ కంపెనీకి చెందిన పరిశ్రమలో ఆయిల్‌ ట్యాంకర్‌ క్లీన్‌ చేయడానికి దిగి ఊపిరి ఆడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లాకు, మిగిలిన ఇద్దరూ కాకినాడ జిల్లాకు చెందినవారు. తోటి కార్మికులు, స్థానికులు, మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న అండ్‌ కో ఆయిల్‌ కంపెనీకి చెందిన పరిశ్రమను ఏడాది క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలోని ఐదో నెంబరు ఆయిల్‌ ట్యాంకును శుభ్రం చేసేందుకు ప్యాకింగ్‌ సెక్షన్‌కు చెందిన ఇద్దరు కార్మికులను అందులోకి యాజమాన్యం దింపింది. 25 అడుగుల ఎత్తున్న ఈ ట్యాంకులోకి ఎలాంటి భద్రతా పరికరాలు ఇవ్వకుండా కార్మికులను పంపింది. వారు రాకపోయే సరికి మరో ఇద్దరిని, ఆ తర్వాత మరో ఇద్దరిని ఇలా విడత విడతలుగా ఏడుగురుని ట్యాంకులోకి దింపింది. ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఏ ఒక్కరూ బయటకు రాకపోవడంతో తోటి కార్మికులు అనుమానం వచ్చి చూసేసరికి అందులో వారు విగత జీవులుగా పడి ఉన్నారు. ఘాటైన వాయువుల వల్ల ఊపిరాడక మృతి చెందారని తోటి కార్మికులు తెలిపారు. ట్యాంకు కింది భాగాన్ని కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో పాడేరుకు చెందిన వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ (38), వెచ్చంగి సాగర్‌ (20), కురతాడు బంజుబాబు (26), కుర్ర రామారావు (43), కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన కట్టమూరి జగదీష్‌ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్‌ (27) ఉన్నారు. వీరిలో కృష్ణ, నరసింహ, సాగర్‌ ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాద విషయం తెలియగానే పొలిమేరు గ్రామం నుంచి మృతులు బంధువులు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. వారి రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్‌పి రవీంద్రనాథ్‌బాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జిజిహెచ్‌కు పోలీసులు తరలించారు.

  • రక్షణ చర్యలు గాలికి

కార్మికుల మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. ఆయిల్‌ ట్యాంకులోకి కార్మికులు దించేటప్పుడు వారికి అవసరమైన ఆక్సిజన్‌ అందించాలి. ట్యాంకర్‌లో వచ్చే ఘాటైన వాయువులను తట్టుకునేందుకు మాస్క్‌లతోపాటు రక్షణ కవచాలు ఇవ్వాలి. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇవేమీ ఇవ్వకుండానే కార్మికులను ట్యాంకులోకి దింపింది. ఆయిల్‌ ట్యాంకులోకి వెళ్లిన కార్మికులు సమయం గడుస్తున్నా ఎందుకు బయటకు రాలేదనే విషయాన్ని కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఏడుగురు కార్మికులు చనిపోయారని తోటి కార్మికులు చెబుతున్నారు. మృతులంత ఫ్యాక్టరీ ప్యాకింగ్‌ కార్మికులు. ఎలాంటి అనుభవమూ లేని వీరిని ట్యాంకును శుభ్రం పని అప్పగించింది. మృతులకు సంబంధించి ఒక్కో కుటుంబానికీ కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు, తోటి కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఆవరణలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఆయిల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు లేవన్నారు. వెంటనే పరిశ్రమ కార్యకలాపాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మృతులకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికీ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. మొత్తంగా ఒక్కొక్క కుటుంబానికీ రూ.50 లక్షలు నష్టపరిహారం అందనుందని కలెక్టర్‌ తెలిపారు.

  • కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఎం

మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఫాక్టరీలో భద్రతా ప్రమాణాలపై ఆడిట్‌ జరగాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కార్మికుల మరణానికి కారణమైన ఆయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్యాక్టరీలలోనూ, పని ప్రదేశాలలోనూ కార్మికులకు భద్రతా ఏర్పాట్లు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే కార్మికుల భద్రత, సంక్షేమంపై కార్మిక సంఘాలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. ఫ్యాక్టరీల్లో, పని ప్రదేశాల్లో కార్మికులు మరణిస్తున్న ఘటనలు ఈ కాలంలో ఎక్కువయ్యాయని, కార్మికులకు భద్రతా చర్యలు కల్పించడంలో యాజమానులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కూడా యాజమానులకే కొమ్ముకాస్తున్నాయి తప్ప, కార్మికుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే నామమాత్రపు పరిహారం, ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్‌ చేయడం లేదని, కార్మిక శాఖను నిర్వీర్యం చేశారని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ మత్తు నుండి రాష్ట్ర ప్రభుత్వం బయట పడాలని, కార్మిక సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

accident-in-oil-factory

 

accident-in-oil-factory

 

kakinada-accident-in-iol-factory-parents

 

accident-in-oil-factory