ప్రజాశక్తి- అచ్యుతాపురం (అనకాపల్లి) :అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ దుస్తుల పరిశ్రమలో ఇటీవల విషవాయువు లీకైన ప్రాంతాన్ని శనివారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) హైదరాబాద్ బృందం పరిశీలించింది. డాక్టర్ జెజె బాబు నేతృత్వంలో కంపెనీ పరిసరాలను పరిశీలించారు. విషవాయువును పీల్చి అస్వస్థతకు గురైన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చికిత్స పొందిన అన్ని ఆస్పత్రులకూ వెళ్లి రిజిస్టర్లు, కేస్ సీట్లు పరిశీలించారు. బాధిత మహిళల గ్రామాలకు వెళ్లి వారితో మాట్లాడారు. విషవాయువు లీకేజీపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు బృందం సభ్యులు తెలిపారు.










